చదివిన రంగంలోనే ఉద్యోగం చేయాలా…అమ్మాయిలు తమ కాళ్లపై తాము నిలబడేందుకు రిస్క్‌ చేయలేరా… టెక్నాలజీ రంగంలో ఆడపిల్లలు ఎక్కువ రోజులు కొనసాగడం కష్టమా…ఇవన్నీ హైదరాబాద్‌కి చెందిన మానసా మడపుని అడిగితే…అవన్నీ అపోహలేనని కొట్టిపారేస్తుంది. సొంతంగా ఏదైనా చేయాలనే తపనతో ఎన్నో సవాళ్లని ఎదుర్కొన్న ఆమె తన ప్రయాణాన్ని ఇలా పంచుకుంది.
అవకాశాలు అందరికీ సమానమే కానీ వాటిని అందిపుచ్చుకునే విషయంలో ఆడపిల్లలు రెట్టింపు కష్టపడాల్సి వస్తుంది. అవకాశాలు అందుకోగానే సరిపోదు. వాటిని వందశాతం సద్వినియోగం చేసుకుని, తమను తాము నిరూపించుకోవడమూ ఓ పెద్ద సవాలే. ఇవన్నీ నా ప్రయాణంలో ఎదురైన అనుభవాలు. నాన్న అశోక్‌కుమార్‌ సింగరేణి ఉద్యోగి. అమ్మ గృహిణి. వాళ్లకేమో నేను ప్రభుత్వోద్యోగం సాధించాలని కోరిక. నాకేమో చిన్నప్పటి నుంచీ సొంతంగా ఏదైనా సంస్థ ప్రారంభించాలని, ఔత్సాహిక వ్యాపారవేత్త కావాలనేది కల. సివిల్‌ ఇంజినీరింగ్‌ చేశాక కొన్నిరోజులు నిర్మాణరంగంలో పనిచేశా. కానీ ఆ ఉద్యోగం నాకేమాత్రం సంతృప్తినివ్వలేదు. అందుకే నా లక్ష్యం చేరుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టా. ఎంటర్‌ప్రెన్యూర్‌గా అడుగులు వేయడానికి ముందు కొంత అనుభవం అవసరం అనిపించిది. అందుకే ఉద్యోగాన్ని వదిలేశా. దిల్లీ వెళ్లి అక్కడో స్టార్టప్‌లో పనిచేశా. నాపై నాకు నమ్మకం వచ్చాక సొంతంగా ఓ స్టార్టప్‌ మొదలుపెట్టాలని అనిపించింది. అలా మళ్లీ హైదరాబాద్‌కి వచ్చేశా.
సాఫ్ట్‌వేర్‌ సేవలే…
ఇక్కడి వచ్చాకే అర్థం అయ్యింది. ఆడపిల్ల సొంతంగా తన కాళ్లపై తాను నిలబడాలంటే.. ఎంత కష్టపడాలో అని. చేస్తున్న ఉద్యోగం వదిలి వచ్చేస్తుంటే అందరూ వింతగా చూశారు. కొందరైతే పెళ్లి చేసుకుని వెళ్లిపోయే నీకు ఇవన్నీ అవసరమా అన్నారు. అమ్మానాన్నలపైనా కాస్త ఒత్తిడి తెచ్చారు. దాంతో వాళ్లు నా భవిష్యత్తు ఎలా ఉంటుందోనని భయపడ్డారు. కానీ ఆలోచనకూ, సృజనకు ఆడామగా అనే తేడా ఉండదు. అందుకే వాళ్ల మాటలేవీ మనసుకెక్కించుకోలేదు. నా ఆలోచనకే కట్టుబడి ఉన్నా. అంతకన్నా ముందు అసలు ఏ రంగంలోకి అడుగుపెట్టాలని చాలా రకాలుగా ఆలోచించా. అదే సమయంలో ఐఐటీ ఖరగ్‌పూర్‌ పూర్వ విద్యార్థి రాజీవ్‌తో పరిచయం అయ్యింది. ఇద్దరి ఆలోచనలూ ఒకేలా ఉన్నాయి. అతను అప్పటికే ఓ కార్పొరేట్‌ కంపెనీలో ఉన్నత స్థాయిలో పనిచేస్తున్నాడు. ఇంతమందికి ఉపాధినందిస్తోన్న సాఫ్ట్‌వేర్‌ సేవల్నే వ్యాపారంగా ఎంచుకుంటే ఎలా ఉంటుందని అనిపించింది. చివరకు మా సంస్థ ద్వారా సాస్‌, క్లౌడ్‌, ఈఆర్‌పీ వంటి సాఫ్ట్‌వేర్‌లనూ, ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌, వెబ్‌ సర్వీసులనూ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం.

q

ఆరునెలల సమయం…
ఆలోచన బాగానే ఉంది. కానీ అది ఆచరణలో మాత్రం కష్టమేనని చాలా తక్కువ సమయంలో తెలిసొచ్చింది. ఎందుకంటే అది తీవ్రమైన పోటీ ఉన్న రంగం. దాంట్లో ఎదురీదాలి. పైగా అనుకున్న వెంటనే ఏదీ మొదలుపెట్టేయలేని పరిస్థితి. అందుకే నాదైన ప్రణాళికలతో అడుగులేశా. అసలు సంస్థలకు సేవలందించాలంటే వాటి అవసరాలు,  మార్కెట్లో వస్తోన్న మార్పులు… వంటివన్నీ పరిశీలించా. ఆ ప్రకారం ఆరునెలలు పరిశోధనలు చేశా. కానీ డబ్బు కావాలి కదా. నేను అప్పటివరకూ ఉద్యోగం చేసి దాచుకున్నదాంతో సంస్థను రిజిస్టర్‌ మాత్రమే చేయగలిగా. అమ్మానాన్నల్ని అడిగితే సాయం చేస్తారు కానీ నాకు ఇష్టంలేదు. చివరకు నేను అద్దెకు ఉన్న ఇంట్లోనే పని మొదలుపెట్టా. కానీ నెలతిరిగే సరికి అద్దె కట్టలేని పరిస్థితి కూడా కొన్నిసార్లు ఎదురైంది. అలాంటి ఓ సందర్భంలో చేతికున్న ఉంగరం అమ్మేశా. అలా కష్టాలనే ఇష్టాలుగా మార్చుకుని మా సాఫ్ట్‌వేర్‌ సేవల్ని అందుబాటులోకి తీసుకురాగలిగాం. ఇంతకీ మేమేం చేస్తామంటే…
రంగం ఏదైనా ఆయా సంస్థలు సాంకేతికంగానూ ప్రజలకు అందుబాటులో ఉండాలనుకుంటున్నాయి. తమ కార్యకలాపాలు సులభతరం చేసుకుంటున్నాయి. వాటికి అవసరం అయిన సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌లను వృద్ధి చేసుకుంటున్నాయి. అలా వినియోగదారుల కోరిక మేరకు వెబ్‌, ఐవోఎస్‌, ఆండ్రాయిడ్‌ వంటి అప్లికేషన్లు, సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసి సంస్థలకు ఇస్తాం. ఉదాహరణకు మా క్లయింట్‌ అహం లెర్నింగ్‌ సెంటర్‌ అవసరాలకు తగ్గట్లు… విద్యార్థులకో మొబైల్‌ యాప్‌, టీచర్లు అందుబాటులో ఉండే సమయం, లాగిన్‌ వంటివాటితో ఓ సాఫ్ట్‌వేర్‌ తయారు చేసి ఇచ్చాం. విద్యారులు, టీచర్ల అటెండెన్స్‌, తరగతి సమయం, నేర్చుకున్న అంశాలు, నేర్చుకోవాల్సినవి డేటా మెయింటెనెన్స్‌ చేస్తున్నాం. సంస్థలు ఎదిగే కొద్దీ వారి అవసరాలను బట్టి మరిన్ని మార్పులు చేస్తాం. బెంగళూరుకి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ బిల్డ్‌బై టెక్నాలజీ పార్టనర్‌గా ఉన్నాం. అంటే ఆ సంస్థకు నిర్మాణరంగంలో అనుభవం ఉంది. ఇప్పుడు ఆధునిక పోకడల్నీ అందిపుచ్చుకోవాలనుకుంటుంది. అందుకోసం మమల్ని భాగస్వాముల్ని చేసుకున్నారు. వాహనం ట్రాకింగ్‌ నుంచి, నిర్మాణ వస్తువుల అందుబాటు, ధరలు, వెండార్స్‌… వంటి వివరాలన్నీ అందుబాటులో ఉండేలా ఓ సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌ తయారు చేసి ఇచ్చాం.
అంతా ఆన్‌లైన్‌లోనే…
వ్యాపారం అంటూ మొదలైపోయింది. దాన్ని నిలబొట్టుకోవడమే సవాల్‌ కదా. దాన్ని చేరుకునేందుకు చాలానే కష్టపడ్డాం. అయితే చేతిలో మంచి ప్రాజెక్టులు ఉండాలి. మాదేమో కొత్త కంపెనీ. మమ్మల్ని నమ్మి ఎవరూ పని ఇవ్వలేదు. చేసిన ప్రాజెక్టుల వివరాలు చెప్పమనేవారు. కొత్తలోనే అది సాధ్యం కాదు కదా. అంతేనా… ‘ఆడపిల్లవు ఎక్కువ రోజులు ఈ రంగంలో ఉండలేవు…ఎలా నిరూపించుకుంటావు’ అని ఎదురు ప్రశ్నించినవారూ ఉన్నారు. ఇవన్నీ ముందే ఊహించా కాబట్టి బలమైన మార్కెటింగ్‌ వ్యవస్థను ఏర్పాటుచేసుకున్నా. నేరుగా ఆన్‌లైన్‌లోనే మార్కెటింగ్‌ మొదలుపెట్టాం. నేనే సంస్థలకు వెళ్లి మాకు అవకాశం ఇవ్వమంటూ అడిగేదాన్ని. చాలామంది నుంచి లేదు, కుదరదు అనే మాటలే వినిపించేవి. అయినా నిరాశపడకుండా ప్రయత్నించేదాన్ని. చివరకు ఆన్‌లైన్‌ ద్వారా ఓ ప్రాజెక్టు వచ్చింది. అది చిన్నదే కావొచ్చు కానీ మాలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. దాన్ని పూర్తిచేసి ఇచ్చేటప్పటికి కొంత ఆదాయాన్ని అందుకున్నాం. అప్పటివరకూ పడిన కష్టాన్ని మరిచిపోయాం. ఆ తరువాత స్నేహితులు బంధువుల సాయంతో మరికొన్ని ప్రాజెక్టులు వచ్చాయి.
దేశ విదేశాల్లోనూ…
మొదట్లో మేమిద్దరమే పనిచేసేవాళ్లం.. పని పెరిగేకొద్దీ సిబ్బంది పెరిగారు. అమెరికా, హైదరాబాద్‌లలో సేవలందిస్తోన్న అహమ్‌ లెర్నింగ్‌ హబ్‌ ఓ పెద్ద ప్రాజెక్ట్‌ని ఇచ్చింది. తరువాత అవకాశాలు పెరిగాయి. చిన్నా పెద్దా అన్నీ కలిపి ఓ వందకు పైగా ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తిచేశాం. మేం కేవలం హైదరాబాద్‌కో, భారత్‌కో పరిమితం కాలేదు. యూరప్‌, సింగపూర్‌, జర్మనీ, అమెరికా దేశాలతో పాటు తాజాగా యూకెకి చెందిన ఓ ప్రముఖ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సంస్థ తమ ప్రాజెక్టుకోసం మమ్మల్ని సంప్రదించింది.