శివుని లీలలను ప్రతిబింభించే దేవాలయాలు మన దేశంలో చాలా ఉన్నాయి. వాటిలో ఒకటి నల్గొండ జిల్లాలోని దామరచర్ల మండలం వాడపల్లిలో మీనాక్షీ అగస్తీశ్వరస్వామి ఆలయం. ఈ ఆలయం విశిష్టత ఏమిటంటే.. ఇక్కడడ శివలింగంలో నీరు నిల్వ ఉంటుంది. అలాగని నీరు తీయకుండానే పొంగిపొర్లవు. పూజారి నీళ్లు సేకరించి భక్తులపై చల్లినప్పుడు అదే పరిమాణంలో మళ్లీ నీళ్లు ఊరుతాయి.

కృష్ణా పుష్కరాలకు వేదికైన ఈ విశిష్ట ఆలయానికి ప్రక్కనే కృష్ణా-మూసి సంగమ ప్రదేశం ఉండటం విశేషం. ఈ క్షేత్రానికి స్థల పురాణం ఉంది. కృతయుగంలో అగస్త్యముని ఒక కావడిలో శివుడు, నరసింహస్వామిని పెట్టుకొని పవిత్ర ప్రదేశంలో వారిని ప్రతిష్ఠించాలని పర్యటించారు. ఈ క్రమంలో వాడపల్లికి వచ్చేసరికి అనుకోకుండా ఆ కావడి కింద పెట్టాల్సివస్తుంది. మళ్లీ ఆ కావడిని ఎత్తడానికి ప్రయత్నిస్తే కదలదు.

ఇక్కడే ప్రతిష్ఠించమని ఆకాశవాణి చెప్పడంతో ముని అలాగే చేశాడు. ఆలయం కొలువుదీరాక అగస్తీశ్వర స్వామి ఆలయం సమీపంలోకి ఓ బోయవాడు పక్షిని వేటాడుతూ వస్తాడు. పరమశివుడు ప్రత్యక్షమై దానిని విడిచిపెట్టమని బోయవాడిని కోరుతాడు. బోయవాడు నాకు ఆకలిగా ఉందని అనడంతో పక్షి అంత మాంసం నా తలలో తీసుకోమని శివుడు చెబుతాడు. బోయవాడు శివుడి తలలో పదివేళ్లు పెట్టి మాంసం తీసుకుంటాడు. శివలింగంలో ప్రస్తుతం నీళ్లు ఉంటున్న తరుగు అలాగే ఏర్పడిందని పురాణ ప్రతీతి.