పద్నాలుగేళ్లకే పెళ్లి.. వద్దంది చిట్టి తల్లి కాదంది కన్నతల్లి.. వేడుకుంది ప్రణమిల్లి కరగలేదు ఆ హృదయం..  ఆదుకుంది అధికార దళం వివాహం చేయమన్నారు బంధుగణం..
*  ఇది నిజమని నమ్మి చేరింది గృహం కల్యాణం కాదన్న ఆ బాలిక ఆనందం.. పెద్దల మోసంతో నిలవలేదు ఎంతో సమయం మళ్లీ పీటలెక్కించాలని చేసింది అమ్మయత్నం ఎలాగోలా ఆ పుత్తడిబొమ్మ.. చేరుకుంది స్వధారహోం

రేపల్లె, 
కంటికి రెప్పలా కాచుకున్న నాన్న దూరమయ్యాడు.. బడి చదువు అర్ధ్ధంతరంగా నిలిచింది.. నాన్న జ్ఞాపకాలు అనుక్షణం వెంటాడుతూనే ఉన్నాయి.. అసలే కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో పిడుగులాంటి వార్త వినాల్సి వచ్చింది.. ‘వచ్చే నెలలో నీకు మావయ్యతో పెళ్లి.. నీకు అన్నీ కొనిపెడతారు.. ఏ కష్టం రాకుండా నిన్ను బాగా చూసుకుంటారు..’ అని తల్లి చెప్పడంతో ఆ పద్నాలుగేళ్ల బాలిక    ఒక్కసారిగా నిశ్చేష్టురాలైంది.. అంతలోనే తేరుకొని నాకు అప్పుడే పెళ్లి వద్దని తల్లిని వేడుకొంది. అధికారుల దృష్టికి తీసుకెళ్లింది.. పట్టువదలకుండా పోరాడటంతో ‘సబల’ ఆదుకొంది.. రేపల్లెలో బాల్య వివాహం నిలిచింది. ఇప్పుడు ఆ బాలిక గుంటూరులోని స్వధారహోంలో ఆశ్రయం పొందుతోంది.

రేపల్లె పట్టణానికి చెందిన దంపతులకు ఇద్దరు అమ్మాయిలు.. కుటుంబ యజమాని చనిపోవడంతో పెద్దమ్మాయి చదువు అర్ధంతరంగా నిలిచింది. తొమ్మిదో తరగతి చదివే బాలిక ఇంటి పట్టునే ఉండి తల్లికి సాయంగా ఉంటోంది. కుమార్తెను తన తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలని తల్లి నెల క్రితం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 18న వివాహం చేయాలని బంధువుల సమక్షంలో నిశ్చయించారు. తనకు అప్పుడే పెళ్లి వద్దని బాలిక ఎంతగా వేడుకొన్నా ప్రయోజనం లేకుండాపోయింది. వివాహ ప్రయత్నాలు ఆపకపోవడంతో ఆ బాలిక స్థానికంగా అంగన్‌వాడీ కార్యకర్తను కలిసి తన కష్టాన్ని చెప్పుకొంది. గత వారం ఆమె ఫిర్యాదు మేరకు సీడీపీవో రాధాకృష్ణ స్పందించారు. ఆయన బాలిక తల్లిని కలిసి బాల్య వివాహం చేయడం మంచిది కాదని నచ్చజెప్పారు. దీంతో ఆమె వివాహం చేయనని చెబుతూ రాత పూర్వకంగా హామీ ఇచ్చింది. కానీ, పెళ్లి పనులు ఆపలేదు. తనకు మూడు ముళ్ల బంధం తప్పదని, ఆందోళన చెందుతున్న సమయంలో తన పాఠశాలలో ‘సబల’ పోలీసు కానిస్టేబుళ్లు చెప్పిన విషయం ఆ బాలికకు గుర్తుకొచ్చింది. వెంటనే వాళ్లకి ఫోన్‌ చేయగా రంగంలోకి దిగారు. బాలికకు రక్షణగా నిలిచారు. శుకవ్రారం గుంటూరు స్వధార్‌ హోమ్‌కు తరలించారు. అక్కడ ఆమెకు కుట్టు శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి కల్పిస్తారని, వివాహ వయసు వచ్చే వరకూ ఉచిత భోజన, వసతి కల్పించి రక్షణ కల్పిస్తామని సీడీపీవో తెలిపారు.