చైనీస్ మొబైల్ దిగ్గజం షియోమీ ‘ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్’ పేరుతో మరోమారు ఆఫర్ల వాన కురిపించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఏప్రిల్ 4వ తేదీ నుండి ఏప్రిల్ 6వ తేదీ వరకు మూడు రోజులపాటు కొనసాగనున్న ఈ సేల్‌ ఆఫర్‌లో పోకో ఎఫ్1, రెడ్‌మీ నోట్ 6 ప్రొ తదితర స్మార్ట్‌ఫోన్లతోపాటు ఎంఐ లెడ్ టీవీ 4 ప్రొ, ఎంఐ బ్యాండ్, ఎంఐ ఎయిర్ ప్యూరిఫైర్ 25 వంటి వాటిపై కూడా భారీ రాయితీలు ప్రకటించింది. సేల్ కొనసాగనున్న ఈ మూడు రోజులు రూపాయి ఫ్లాష్ సేల్, మిస్టరీ బాక్స్ సేల్ కూడా నిర్వహించనుంది. ఎంఐ డాట్ కామ్, ఎంఐ హోం, ఎంఐ స్టోర్‌లలో సేల్ కొనసాగనుంది.

ఈ మేరకు పోకో ఎఫ్1 6జీబీ ర్యామ్+28 జీబీ వేరియంట్ ధరను రూ.22,999 నుండి రూ.20,999కి తగ్గించగా… 4జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజీ వేరియంట్, 6జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజీ వేరియంట్‌లను కలిగి ఉన్న రెడ్‌మీ నోట్5 ప్రొ అసలు ధరలు వరుసగా రూ.12,999, రూ.13,999గా ఉంటూండగా ఇప్పుడు వాటిని వరుసగా రూ.10,999, రూ.11,999కి అందజేస్తోంది. రెడ్‌మీ నోట్ 6 ప్రొ 4జీబీ+64 జీబీ ధరను రూ. 3 వేలు తగ్గించి రూ.10,999కే అందుబాటులోకి తీసుకువచ్చింది.

వీటితోపాటుగా కంపెనీ తాజాగా లాంచ్ చేసిన రెడ్‌మీ నోట్ 7, రెడ్‌మీ నోట్ 7 ప్రొ, రెడ్‌మీ గో స్మార్ట్‌ఫోన్లను కూడా ఈ సేల్‌లో అందుబాటులో ఉంచింది. ఈ నెల 4వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానున్న ఈ సేల్‌లో రెడ్‌మీ 6, రెడ్‌మీ 6 ప్రొ, రెడ్‌మీ 6ఎతోపాటు పలు ఫోన్లు రాయితీలపై లభించనున్నాయి. ఎంఐ కాంపాక్ట్ బ్లూటూత్ స్పీకర్ 2 (రూ.699), ఎంఐ ఇయర్‌ఫోన్స్ (రూ.599), ఎంఐ బాడీ కాంపోజిషన్ (రూ.1,499), ఎంఐ ఎయిర్ ప్యూరిఫైర్ 2ఎస్ (రూ.8,499), ఎంఐ బ్యాండ్ హెచ్ఆర్ఎక్స్ ఎడిషన్ (రూ.999) లను విక్రయంలో భాగంగా లిస్ట్ చేసింది.

కాగా… హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేసే వారికి రూ.500 తక్షణ డిస్కౌంట్ లభించనుండగా… మొబిక్విక్ వినియోగదారులకు 15 శాతం తక్షణ మొబిక్విక్ సూపర్ క్యాష్ లభిస్తుంది. ఈ సేల్ మొత్తం ఈ ఆఫర్ అందుబాటులో ఉండగా తగ్గింపు మొత్తం గరిష్టంగా రూ.2 వేల వరకు మాత్రమే లభిస్తుంది.