ఒకే తరగతి పిల్లలే కావొచ్చు… అయినప్పటికీ వారి గ్రహణశక్తిలో, జ్ఞాపకశక్తిలో ఒక్కొక్కరి మధ్య ఎంతో తేడా ఉంటుంది. ఒకే తరగతి పిల్లలయినా వారి వారి తల్లిదండ్రుల స్థాయీ, అంతస్తుల్లో అంతరం ఉండవచ్చు. వాళ్లల్లో కొందరు ఉన్నత చదువులు చదువుకున్న వాళ్లు ఉండవచ్చు. ఇంటర్‌తోనో, డిగ్రీతోనో ఆగిపోయిన వాళ్లు ఉండవచ్చు. కొందరు నిరక్షరాస్యులూ ఉండవచ్చు.  అయితే పెద్దగా చదువుకోని వాళ్లల్లో కూడా సహజసిద్ధ జ్ఞానం ఎంతో ఉంటుంది. పెద్దగా ఆస్తిపాస్తులేమీ లేకపోయినా గొప్ప జీవిత జ్ఞానం, ఉన్నతమైన వ్యక్తిత్వమే సంపదగా జీవిస్తున్న వాళ్లు కూడా ఉండవచ్చు. అందువల్ల ఉన్నత విద్యావంతులను, సంపన్నులుగా కనిపిస్తున్న వాళ్లనే గౌరవిస్తూ మిగతా వారిని పట్టించుకోకుండా ఉండిపోవడం సమంజసం కాదు కదా!
ఈ విషయాన్ని గుర్తెరిగి తల్లిదండ్రులు ఈ ధోరణికి భిన్నంగా పిల్లల్ని పెంచాల్సి ఉంటుంది. ఈ రోజున ఉన్న సంపద రేపు ఏ కారణంగానో సమూలంగా కరిగిపోవచ్చు. అనూహ్యంగా బతుకు రోడ్డున పడొచ్చు. అలాగే, కాలేజీ చదువులతో వచ్చిన విషయజ్ఞానం, జీవిత సమస్యల్ని పరిష్కరించడంలో ఎందుకూ కొరగాకుండాపోవచ్చు. నిజానికి పెద్దగా సంపన్నుడేమీ కాకపోయినా, కష్టించి పనిచేసేతత్వం ఉన్నవాడు జీవితాంతం సంతోషంగానే ఉంటాడు. అపారమైన జీవితానుభవం, గొప్ప ఆత్మవిశ్వాసం ఉన్నవాడు, పెద్దపెద్ద డిగ్రీలేమీ లేకపోయినా, అన్ని ఒడిదుడుకుల్నీ అధిగమిస్తూ విజేతగా నిలబడవచ్చు.
అందుకే పైపైన గొప్పగా కనిపించనంత మాత్రాన వాళ్లు తక్కువ అనుకోవడం పెద్ద తప్పని పిల్లలకు అప్పుడప్పుడు చెబుతూ ఉండాలి. నిజానికి జీవితానికి అవసరమైన సమస్త విషయ పరిజ్ఞానం కేవలం టీచర్లనుంచే ఏమీ రాదు. కేవలం తల్లిదండ్రుల నుంచే అన్నీ తెలియవు. విషయ పరిజ్ఞానం అనేది అనంతమైనది. ఎంతో మంది పెద్దవాళ్లు, అనుభవజ్ఞులనుంచి గానీ, నేర్చుకోవడం సాధ్యం కాదు. అలా సంక్రమించే జ్ఞానం, జీవిత నిర్మాణంలో, వ్యక్తిత్వ నిర్మాణంలో అద్భుతంగా తోడ్పడుతుంది.
మనిషి మనుగడకూ, పురోగతికీ అవసరమైన జ్ఞానమంతా పాఠ్య పుస్తకాల్లోంచే వ స్తుందనుకుంటే అదీ పొరపాటే. వాస్తవానికి జీవిత జ్ఞానమనేది సముద్రం లాంటిది. అంతటి జ్ఞానాన్ని ఎంత పెద్ద పుస్తకంలోనైనా ఇమడ్చడం కష్టమే. అలాంటి జ్ఞానం కొందరు వ్యక్తులను కలవడం ద్వారానే ఎక్కువగా వస్తుంది. అందుకే స్థాయీ భేదాల జోలికి పోకుండా పెద్దవాళ్లను గౌరవించడం ద్వారా… వారి ప్రేమను చూరగొనడం ద్వారా ఎన్నో మంచి విషయాలు తెలుసుకోవచ్చు. లక్ష్యాన్ని చేరుకునే మంచి మార్గాల్ని తెలుసుకోవచ్చు. ఈ జీవితసత్యాన్ని తెలియజెప్పే మాటల్ని అప్పుడప్పుడు చెబుతూ ఉండడం పిల్లల ఉన్నతికి ఎంతో అవసరం!