అడవుల్లేని దేశం అది. ఏడాదంతా మంచు పరుచుకొని ఉంటుంది. వందలకు పైగా అగ్నిపర్వతాలను తనలో దాచుకొన్న విశిష్టత దీని సొంతం. అందుకే ప్రపంచంలోని అనేకమంది సందర్శకులు చూడటానికి పోటీపడతారు. ఈ దేశం పేరు ఐస్‌ల్యాండ్‌. ఇదొక దీవి. దీన్ని ల్యాండ్‌ ఆఫ్‌ ఫైర్‌, ఐస్‌గా అభివర్ణిస్తారు. అట్లాంటిక్‌ మహాసముద్రాన్ని ఆనుకొని ఉన్న ఈ దేశానికి పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరు. ప్రతి నాలుగేళ్లకొకసారి బద్దలయ్యే అగ్నిపర్వతాలు నిప్పులు చిమ్ముతూ ఉంటాయి. ఆ భయానక వాతావరణంలో కూడా హెలికాప్టర్లో చక్కర్లు కొడుతూ వీక్షించవచ్చు. మరికొంత మంది ఆ అగ్నిపర్వతాల సమీపం వరకూ వెళ్లడానికి కూడా ఉత్సాహం చూపుతారు.
చూడాల్సిన ప్రదేశాలు: బ్లూ లాగూన్‌ (వేడి నీటి సరస్సు), గోల్డెన్‌ సర్కిల్‌ జలపాతం, అక్రుయెరీ పట్టణం
ఎలా వెళ్లాలి: ఐస్‌ల్యాండ్‌కు వెళ్లాలంటే కెఫ్లాఫిక్‌ అంతర్జాతీయ విమానశ్రయానికి మన దేశంలోని ప్రధాన విమానాశ్రయాల నుంచి నేరుగా సర్వీసులు లేవు. యూరోప్‌, ఉత్తర అమెరికాలోని పలు ప్రధాన నగరాల నుంచి కనెక్టింగ్‌ ఫ్లయిట్స్‌ ఉంటాయి. లండన్‌, న్యూయార్క్‌, సీటిల్‌ నగరాలను చేరుకొని అక్కడి నుంచి ఐస్‌ల్యాండ్‌ వెళ్లొచ్చు.