1983…బొంబాయిలో నేషనల్‌ టీమ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల ప్రకటన వెలువడింది. ఆ పోటీల్లో పాల్గొనేందుకు రెండు పెద్ద జట్లను ఎంపిక చేయాలని తమిళనాడు చదరంగ క్రీడా సంస్థ కార్యవర్గం నిర్ణయించింది. ఆ మేరకు ఆటగాళ్లను ఎంపిక చేసి, వారిని బొంబాయి పంపించేందుకు విరాళాలు కూడా స్వీకరించారు. భారతదేశ తొలి ఇంటర్నేషనల్‌ మాస్టర్డ్‌ మ్యాన్యువల్‌ ఆరన్‌ అప్పట్లో తమిళనాడు చెస్‌ అసోసియేషన్‌కు కార్యదర్శిగా ఉండేవారు. ఆయనకు ఓ ఆలోచన వచ్చింది. మీసకట్టు రాకపోయినా తలపండిన మేధావుల ఆటకట్టించే సత్తా ఉన్న కొందరు చిన్నారులు ఆ రోజుల్లో మద్రాసులో ఉన్నారు. వారిని గనక జాతీయ స్థాయి పోటీలకు పంపితే అక్కడి విభిన్నమైన వాతావరణం చిన్నారులకు దోహదపడుతుందని, పెద్దలను ఎదుర్కొన్న అనుభవం పిల్లల ప్రతిభను సానపెడుతుందని మాన్యువల్‌ ఆరన్‌ భావించారు. వెంటనే మెరికల్లాంటి బాలురతో మద్రాస్‌ కోల్డ్స్‌ అనే బృందాన్ని తయారు చేశారు. ఆరన్‌ ఆలోచన మంచిదే కానీ అప్పటికే రెండు పెద్ద జట్ల కోసం విరాళాల సేకరణ పూర్తయింది. పిల్లల జట్టు కోసం స్పాన్సర్లను వెదుక్కోవాలి. ఎలా?

 

మాన్యువల్‌ ఆరన్‌కు ప్రముఖ కవి, చదరంగ ప్రియుడు అయిన ఆరుద్ర మంచి మిత్రుడు. అప్పట్లో ఆరుద్ర మద్రాసు డిస్ట్రిక్ట్‌ చెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. దీంతో ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఖర్చువెచ్చాలు అంచనా వేసుకున్నారు. తప్పకుండా ప్రయత్నిద్దాం అన్నారు ఆరుద్ర. అన్నది తడవుగా డబ్బు సర్దుబాటు కోసం వేటలో పడ్డారు. మర్నాడు విజయా గార్డెన్స్‌లో ఆరుద్ర రాసిన పాట రికార్డింగ్‌ జరుగుతోంది. గాయకుడు బాలు. ఆ సందర్భంగా తనకో చెక్కు రాసిమ్మన్నారట ఆరుద్ర. ఎందుకు? అని ప్రశ్నించకుండా ఎంత మొత్తం కావాలని అడిగి చెక్కు రాసిచ్చారట బాలు. చెక్కు తీసుకున్న తరువాత కారణం వింరించారట ఆరుద్ర.

ఆ చెక్కు వల్ల ఓ మహోపకారం జరిగింది. అది గాయకుడు బాలుతో పాటు భారతదేశానికే గర్వకారణమై నిలిచింది. ఎందుకంటే బాలు స్పాన్సర్‌షిప్‌ ద్వారా బొంబాయి పోటీల్లో పాల్గొన్న మెరికల్లాంటి నలుగురు కుర్రాళ్లలో విశ్వనాథన్‌ ఆనంద్‌ కూడా ఉన్నారు. భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన ఒక మహోన్నత క్రీడాకారుడి ప్రస్థానం శుభారంభం చేయడం వెనక ఆరుద్ర ప్రయత్నం ఉందంటూ ఆరుద్ర షష్టిపూర్తి సంచికలో ఇంగ్లిష్‌లో రాసిన వ్యాసంలో ఆరన్‌ ప్రశంసించారు. కాగా విశ్వనాథన్‌ ఆనంద్‌ను అభినందిస్తూ జరిగిన సన్మాన సభలో బాలు మరో చెక్కును బహూకరిస్తూ విజయపథంలో దూసుకుపొమ్మని ఆశీర్వదించారని, అందువల్ల ఆనంద్‌ విజయాలకు అంకురార్పణ చేయడంలో తనకన్నా గాయకులు బాలూ ప్రోత్సాహమే గొప్పదని తాను రాసిన సినీ మినీ కబుర్లలో ఆరుద్ర ప్రస్తుతించడం విశేషం.