ఆహారోత్పత్తుల వ్యాపారంలోకి ఫ్యూచర్‌ గ్రూప్‌ అడుగుపెడుతోంది. భోజనప్రియులకు సరసమైన ధరలకే నోరూరించే వంటకాలను అందించేందుకు సిద్ధమవుతున్నట్లు ఫ్యూచర్‌ గ్రూప్‌ వెల్లడించింది. సొంత వంటశాలలను ఏర్పాటు చేసి.. ఇక్కడ నుంచి రూ.40కే భోజనం, రూ.10కే రెండు సమోసాలను అందించే దిశగా నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ సీఈఓ కిషోర్‌ బీయానీ తెలియజేశారు. ఫ్యూచర్‌పే యాప్‌ ద్వారా కస్టమర్లకు ఆహారాన్ని అందిస్తామని వెల్లడించిన ఆయన.. హోటల్‌ ఏర్పాటు లేదని, కేవలం డోర్‌ డెలివరీలు మాత్రమే ఉంటాయని స్పష్టంచేశారు. ‘త«థాస్తు’ పేరిట యాప్‌లో ప్రత్యేక ప్లాట్‌ఫాం ఏర్పాటుచేయడం ద్వారా ఈ సేవలను ప్రారంభించనున్నామని తెలిపారు. తమ బ్రాండ్‌ బియ్యం, గోధుమ పిండి వినియోగం పెంచడంలో ఈ క్లౌడ్‌ కిచెన్‌ కాన్సెప్ట్‌ సహకరించనుందన్నారు. ‘ఇప్పటివరకు ఫ్యాషన్‌పైన దృష్టి సారించాం. ఇక నుంచి ఆహార వ్యాపారంపై ఫోకస్‌ పెంచుతున్నాం. దీర్ఘకాలంలో ఈ విభాగం ద్వారా 50–60 శాతం అమ్మకాలను అంచనావేస్తున్నాం’ అని వెల్లడించారు.