బాహుబలి-2 సినిమా ప్రారంభ సన్నివేశం గుర్తుంది కదా.. మదమెక్కిన ఏనుగును బాహుబలి మచ్చిక చేసుకునే తీరు రోమాలు నిక్కబొడిచేలా చేస్తుంది. ఇంచుమించు అలాంటి ఫీట్‌తోనే ఓ సాధారణ యువకుడు ఇప్పుడు రియల్ హీరోగా మారిపోయాడు. అవును.. తమిళనాడుకు చెందిన పి శరత్‌కుమార్ (28) ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తిగా మారిపోయాడు. ఓ గోతిలో చిక్కుకుపోయిన బుజ్జి గజరాజాన్ని శరత్‌కుమార్ తన భుజాలపై మోసుకొస్తున్న ఘటనకు సంబంధించిన ఫొటోలు ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారిపోయాయి.

ఊటీ ప్రాంతానికి 50 కి.మీ. దూరంలోని మెట్టుపలాయమ్‌ అటవీ పరిధిలో ఫారెస్టు గార్డుగా విధులు నిర్వహించే శరత్‌కు గత డిసెంబర్ 12న అకస్మాత్తుగా ఫోన్ కాల్ వచ్చింది. అక్కడికి సమీపంలోని ఓ రహదారిపై ఓ ఏనుగు వీరంగం చేస్తోందని ఆ ఫోన్ కాల్ సమాచారం. వెంటనే బయలుదేరిన శరత్.. స్పాట్‌కి వెళ్లి దాన్ని రోడ్డు పక్కకి తరిమే ప్రయత్నం చేశాడు.

ఆ మదగజాన్ని అడవిలోకి పంపించడానికి శరత్‌తో పాటు చాలా మంది వాహనదారులు శత విధాలా ప్రయత్నించారు. టపాసులు పేల్చి భయపెట్టినా.. అదిలించినా, బెదిరించినా.. అది చాలా సేపటి వరకు అక్కడి నుంచి కదల్లేదు. దీంతో శరత్‌కు ఓ అనుమానం వచ్చింది. అది ఏనుగుల మంద నుంచి తప్పిపోయి ఉండాలి.. లేదా ఏదైనా ప్రమాదంలో ఉండాలి.

తన బృందంతో కలిసి చుట్టుపక్కల ప్రాంతాలను గాలించిన శరత్‌కు ఓ చోట విషాదకర దృశ్యం కనిపించింది. ప్రమాదవశాత్తూ గొయ్యిలో పడిపోయిన ఓ పిల్ల ఏనుగు.. పైకెక్కడానికి నానా పాట్లు పడి, నీరసించి అచేతనంగా పడి ఉంది. వెంటనే ఆ బృందం దాన్ని పైకి తీసుకురావడానికి ప్రయత్నం ప్రారంభించారు.