సాయంత్రం నాలుగు గంటలు… పని చేసుకుంటూనే మధ్యమధ్యలో గుమ్మం వైపు చూస్తోంది సంధ్య. అలా సమయం గడుస్తూనే ఉంది. కానీ ఉదయం అనగా స్కూల్‌కి వెళ్లిన నాలుగేళ్ల కూతురు ఇంకా ఇంటికి రాలేదు. ఆందోళనగా ఆఫీసులో ఉన్న భర్తకు ఫోన్‌ చేసి విషయం చెప్పింది. హుటాహుటిన ఇంటికి వచ్చాడు. ఇద్దరూ కలిసి స్కూల్‌కు వెళ్లారు. తమ పాప సాయంత్రం అసలు బస్సే ఎక్కలేదని తెలిసింది. తెలిసిన వాళ్లను అడిగారు. ఎక్కడా జాడ లేదు. పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు నమోదైంది. రెండు రోజుల తర్వాత నిందితుణ్ణి పోలీసులు అరెస్ట్‌ చేశారు. పాప క్షేమం. అసలు తమ కూతురు గురించి కిడ్నాపర్‌కు వివరాలు ఎలా తెలిశాయి? సోషల్‌ మీడియా ద్వారానే అని విచారణలో తేలింది. నిర్ఘాంతపోయారా తల్లితండ్రులు.
నాలుగేళ్ల పాపకు సోషల్‌ మీడియా ఖాతా ఉండదు. కానీ ఎలా తెలిసింది? దీనికి తల్లితండ్రులే కారణం. ‘సోషల్‌ మీడియాకు దూరంగా ఉండండహో…’ అంటూ యువతకు, పిల్లలకు సందేశాలు ఇస్తూనే ఉంటారు పెద్దవాళ్లు. కానీ ఈ నియమాలు వాళ్లు పాటిస్తున్నారా? లేదనే అంటున్నాయి పలు అధ్యయనాలు. పిల్లలకూ ఆన్‌లైన్‌ ప్రైవసీ కావాలని ప్రపంచవ్యాప్తంగా నినాదాలు హోరెత్తుతున్నాయి.
షేరెంటింగ్‌ నేరమా?
చిన్నారుల ప్రతి జ్ఞాపకాన్ని ప్రపంచంతో పంచుకోవాలన్న ఉత్సాహం పేరెంట్స్‌లో ఉంటుంది. అందుకే కొందరు ప్రతీ విషయాన్ని వెంటనే ఆన్‌లైన్‌లో పోస్ట్‌ చేస్తూ ఉంటారు. దీన్నే ‘షేరెంటింగ్‌’ అంటారు. ‘ఏం మా పిల్లలే కదా! మా ఇష్టం’ అని అనవచ్చు. అయితే ఇలా చేయడం ముమ్మాటికే తప్పు అంటున్నారు సామాజిక నిపుణులు. కొంతమంది తల్లితండ్రులైతే పిల్లల అర్ధనగ్న చిత్రాలనూ పోస్ట్‌ చేస్తున్నారు. దాంతో సరైన సమయం కోసం వేచి చూస్తున్న నేరస్థులకు అవకాశం ఇచ్చినవాళ్లమవుతాం. ప్రతిరోజూ సోషల్‌ నెట్‌వర్క్‌లో చిన్నారుల ఫోటోలు దుర్వినియోగం అవుతున్నాయని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
చిన్నారులకూ అవమానమే!
భలే ముద్దుగా ఉన్నాడనీ లేదా మారాం చేస్తోందనీ చాలామంది పిల్లల ఫోటోలు తీసి సామాజిక మాధ్యమంలో పోస్ట్‌ చేస్తారు. పిల్లలకు ఊహ తెలీదు కాబట్టి ఇప్పుడేమీ అడగకపోవచ్చు. కానీ వాళ్లు పెద్దయ్యాక ఆ ఫోటోలు చూసుకున్నాక కచ్చితంగా ఏదో అవమానంగా ఫీల్‌ కావచ్చు. అందుకే పిల్లలకు సంబంధించి ఎలాంటి ఫోటోలు, వీడియోలు పోస్ట్‌ చేస్తున్నారో తల్లితండ్రులు విచక్షణ కలిగి ఉండటం అవసరం.
మీ పిల్లాడూ ఓ ప్రచారాస్త్రమే!
కొన్ని కంపెనీల వాళ్లు తమ వ్యాపార ప్రయోజనాల కోసం అనుక్షణం అంతర్జాలాన్ని జల్లెడ పట్టే పనిలో బిజీగా ఉంటారు. వాళ్ల ఉత్పత్తుల కోసం పిల్లలను టార్గెట్‌ చేసే అవకాశాలు ఎక్కువ. ఒక్కసారి మీ చిన్నారుల సమాచారం బయటకు తెలిసిందంటే, వారిక ఓ వ్యాపార వస్తువుగా మారిపోతారు. వారిపై నిఘా పెరుగుతుంది. మీరు పోస్ట్‌ చేసిన వీడియోలు, ఫోటోలతో ఓ ప్రొఫైల్‌ క్రియేట్‌ చేసుకొని తమ వ్యాపార అవసరాల కోసం ఉపయోగించుకుంటూ ఉంటాయి.
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌ను ఎలా ఉపయోగించాలో పెద్దవాళ్ల కన్నా పిల్లలకే ఎక్కువగా తెలుస్తోంది. అయిదేళ్లు దాటిన పిల్లలు సైతం గేమ్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని ఆడుకుంటున్నారు. ఫోన్‌లో ఉండే రకరకాల ఫీచర్లను తెలుసుకుంటున్నారు. వాళ్లు తమ ఫోటో లేదా వీడియో పోస్ట్‌ చేయాలో వద్దో తెలీని పరిస్థితిలో ఉంటారనుకోవడం తప్పే. అందుకే ఒకవేళ వాళ్ల ఫోటోలు ఆన్‌లైన్‌లో పెట్టాలంటే కచ్చితంగా పిల్లల అనుమతి తీసుకొని పోస్ట్‌ చేయండి.
ఏం చేయాలి?
  • మీరు వినియోగిస్తున్న సామాజిక మాధ్యమంలో ఏ పోస్ట్‌ చేసినా అది కేవలం మీ సన్నిహితులు, కుటుంబసభ్యులకే తెలిసేలా ప్రైవసీ కంట్రోల్స్‌ను ఒకసారి సెట్‌ చేసుకోండి. ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ లాంటి సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు పోస్ట్‌ చేసినప్పుడు ఫోన్‌లోని లొకేషన్‌ ఆన్‌లో ఉంటే పిల్లలు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలిసిపోతుంది. కిడ్నాపర్లు ఇదే అదనుగా ఏదైనా అపాయానికి ఒడిగట్టవచ్చు. ముఖ్యంగా ఇంటికి దూరంగా ఉన్నప్పుడు ఈ జాగ్రత్త అత్యవసరం.
  • మీరు పోస్ట్‌ చేయాలనుకున్న ఫోటోలో స్కూల్‌, ఇళ్ల చిరునామాలు కనబడని విధంగా మార్పులు చేయండి. ఒక అజ్ఞాత వ్యక్తి చూసినా ఏం ఫర్లేదని మీరు భావిస్తేనే ఆ పని చేయండి.
  • మీ సన్నిహితులు లేదా కుటుంబసభ్యులు చిన్నారుల ఫోటోలను పోస్ట్‌ చేయడానికి ముందు మీ అనుమతి కచ్చితంగా తీసుకోవాలని చెప్పండి.
అనుమతి అనవసరం అంటున్నారు!
ప్రముఖ సైబర్‌సెక్యూరిటీ సంస్థ ‘మెక్‌ఫీ’ ముంబయి, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో ‘ద ఏజ్‌ ఆఫ్‌ కన్సెంట్‌’ పేరుతో ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. 1 నుంచి 16 ఏళ్ల పిల్లలున్న వెయ్యి మంది తల్లితండ్రులను ఈ అంశం మీద ప్రశ్నించి, అభిప్రాయాలను రాబట్టగలిగింది.
  • పబ్లిక్‌ సోషల్‌మీడియా ఖాతాలైన ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగారమ్‌, వాట్సాప్‌ లాంటి సామాజిక మాధ్యమాల్లో పిల్లలకు సంబంధించిన పోస్టింగ్‌లు చేయడం సరికాదు. ఎందుకంటే పబ్లిక్‌ సోషల్‌ మీడియా ఖాతాలు. ఎవరైనా చూసే ప్రమాదం ఉంది. అయితే ఇలా పోస్టింగ్స్‌ చేసేవాళ్లు 42 శాతం ఉంటే, కేవలం ‘యామర్‌, కపుల్‌, పాత్‌, ఫ్యామిలీవాల్‌’ లాంటి ప్రైవేటు సోషల్‌ మీడియా ఖాతాలను ఆశ్రయిస్తున్నవారి సంఖ్య 55 శాతం.
  • 62 శాతం మంది తల్లితండ్రులు పిల్లల అనుమతి అవసరమే లేదని చెప్పారు. ఈ విషయంలో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. అయితే పిల్లల అనుమతి అడగడంలో తండ్రులే కాస్త మెరుగ్గా ఉన్నారు. 55 శాతం మంది తమ పిల్లలను అడుగుతామని చెప్పారు. ఇక 63 శాతం మంది తల్లులు అంత అవసరం లేదన్నారట కూడా.
  • రోజుకు ఒక్కసారైనా పోస్టింగ్‌ చేసే తల్లితండ్రులు 40.5 శాతం, కనీసం వారానికోసారి పోస్ట్‌ చేసేవాళ్లు 36 శాతం వరకూ ఉన్నారని ఈ గణాంకాలు చెబుతున్నాయి. ఈ విషయంలో ముంబయి (48 శాతం) మొదటి స్థానంలో ఉంటే, ఢిల్లీ (38.5 శాతం), బెంగుళూరు (31 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
  • యూనిఫామ్‌లో పిల్లలను ఫోటో తీసి ఆన్‌లైన్‌లో పోస్ట్‌ చేస్తున్న వారు ముంబయి (71 శాతం)లో అధికంగా ఉన్నట్లు తెలిసింది.
నజర్‌ రఖో!
  • పిల్లల సామాజిక మాధ్యమాల ఖాతాల లాగిన్‌, పాస్‌వర్డ్‌లు మీ దగ్గర ఉంచుకోండి. ఎప్పటికప్పుడు వారి పోస్టింగ్స్‌ను గమనించండి. వాళ్లు తెలియకుండా లేదా తెలిసి ఏమైనా అభ్యంతరకరమైనవి పెడితే మాత్రం అందులో మంచి, చెడులను విశ్లేషించి చెప్పండి.
  • సోషల్‌మీడియాలో గడిపే సమయాన్ని నిర్దేశించండి. లేదంటే బానిసయ్యే అవకాశాలూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు వాళ్లు ఆడుతున్న గేమ్స్‌, చూస్తోన్న వెబ్‌సైట్లను పరిశీలించండి. పిల్లలు చూడకూడని కంటెంట్‌ అంతర్జాలంలో చాలా ఉంటుంది. వాటిని ఫిల్టర్‌ చేయడానికి పేరెంటల్‌ యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకోండి. ఒకవేళ వాళ్లకూ స్మార్ట్‌ఫోన్లుంటే వారేం చేస్తున్నారో చెక్‌ చేయడం మంచిది.
  • ఆన్‌లైన్‌లో వాళ్లకు కొన్ని సార్లు చేదు అనుభవాలు ఎదురవ్వొచ్చు. అన్నీ తల్లితండ్రులకు చెప్పలేరు. ఎందుకంటే తమను కట్టడి చేస్తారేమో అనే భయం వారికి ఉంటుంది. అందుకే వారేం చేస్తున్నారో, ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయో స్నేహపూర్వకంగా అడిగి తెలుసుకోండి. అప్పుడే వారు మనసు విప్పి మాట్లాడగలరు.
యూనిఫామ్‌లో వద్దు!
పిల్లలు కొత్తగా స్కూల్లో చేరారంటూ చాలా మంది తల్లితండ్రులు స్కూల్‌ యూనిఫామ్‌లో ఉన్న ఫోటోలను పోస్ట్‌ చేస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరమని సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల పిల్లల వ్యక్తిగత భద్రతకు భంగం వాటిల్లుతోంది. వాళ్లేం చదువుతున్నారో, వారిది ఏ స్కూల్‌, వారి పుట్టిన తేదీలు.. ఇవన్నీ సైబర్‌ నేరగాళ్లకు కావాల్సిన వ్యక్తిగత సమాచారాన్ని ఇచ్చినట్టే. ఈ అతికొద్ది సమాచారంతో వారు ఏదైనా చేయవచ్చు.
కఠిన చట్టాలేవి?
‘చిల్డ్రన్‌ ఆన్‌లైన్‌ ప్రైవసీ ప్రొటక్షన్‌ రూల్‌’ అని అమెరికాలో ఇప్పటికే ఓ చట్టం ఉంది. 13 ఏళ్లలోపు పిల్లల సమాచారాన్ని కట్టడి చేసే విధంగా అందులో ఆంక్షలు ఉన్నాయి. కానీ భారత్‌లో చిన్నారుల ఆన్‌లైన్‌ ప్రైవసీ గురించి కఠిన చట్టాలు లేవు.
ఎంత క్లోజ్‌ అయినా వద్దు!
పిల్లల ఫోటోలను ప్రపంచమంతా తెలిసేలా పోస్ట్‌ చేయడం మంచిది కాదు. తల్లితండ్రులు కూడా ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. 18 ఏళ్ల లోపు పిల్లలకు తల్లితండ్రులే సంరక్షకులు. వారికి సంబంధించిన పోస్టింగులను పెట్టే ముందు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌…. ఇలా ఏదైనా కావచ్చు. ముందుగా వాటిలోని ప్రైవసీ సెట్టింగ్స్‌ను చెక్‌ చేసుకోవాలి. కొంత మందికి ఇలాంటి సాంకేతిక అంశాలపై అంతగా అవగాహన ఉండదు. కానీ తెలుసుకోవాల్సిందే. ఫోటోలను షేర్‌ చేసుకోవడానికి మీ కుటుంబసభ్యుల కోసం కొత్తగా ఓ గ్రూప్‌ క్రియేట్‌ చేసుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయమేమిటంటే, మీ పిల్లల ఫోటోలను మీరు తప్పించి ఎవరూ ఆన్‌లైన్‌లో షేర్‌ చేయకుండా చూడండి. వాళ్లు పిల్లలకు బాబాయి, పిన్ని, మావయ్య ఇలా మీ ఫ్యామిలీకి ఇంకా క్లోజ్‌ కావచ్చు. కానీ అలా ఫోటోలను పెట్టడం న్యాయబద్ధం కాదు. అలాగే పిల్లలు స్కూల్‌ యూనిఫామ్‌లో ఉన్న ఫోటోలను కూడా పోస్ట్‌ చేయకూడదు. ఇలా చేస్తే పిల్లలకే ప్రమాదం.