యసు మళ్లిన కొందరికి ఒక దశలో స్థిరంగా నడవలేని స్థితి ఏర్పడుతుంది. ఎక్కడ పడిపోతానా! అన్న భయం అడుగడుగునా వెంటాడుతూ ఉంటుంది. దీనివల్ల యదేచ్ఛగా ఎక్కడికంటే అక్కడికి వెళ్లే ధైర్యాన్ని కోల్పోతారు. ఈ పరిస్థితికి పెరిగిన వయసు తాలూకు కారణాలు చాలానే ఉంటాయి. వాటిల్లో కండరాలు బలహీనపడటం, కీళ్లు పట్టు సడలడం వంటివి కొన్ని. ఈ స్థితిలో ఏ కాస్త దూరమైనా స్థిరంగా నడవడం ఒక సవాలుగా మారుతుంది. వీటితో పాటు కొందరికి దృష్టిలోపాలు కూడా పెద్ద ఆటంకంగా మారతాయి. తిన్నగా నడిచివెళ్లడంతో పోలిస్తే, మలుపు తిరిగే చోట పడిపోయే ప్రమాదం ఎక్కువ . వీటన్నిటినీ మించి గుండె రక్తనాళాల సమస్యలు ఉన్నప్పుడు రక్తపోటు పెరగడం, హఠాత్తుగా తగ్గడం వంటివి పడిపోవడానికో, సొమ్మసిల్లిపోవడానికి కారణం కావచ్చు.
పార్కిన్‌సన్‌ వ్యాధి వల్ల గానీ, పక్షవాతం కారణంగా నరాలు దెబ్బతినడం వల్లగానీ, కండరాలు క్షీణించి తరుచూ పడిపోయే స్థితి ఏర్పడుతుంది. ఇవే కాకుండా వృద్ధుల్లో కొందరు రోజూ మూడు నాలుగు రకాల మాత్రలు వేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా యాంటీ డిప్రెసెంట్‌ మందులు గానీ, మూర్ఛవ్యాఽధికి సంబంధిచిన మందులు గానీ వేసుకునే వారికి ఆ మందుల దుష్ప్రభావాల వల్ల అప్పుడప్పుడు మగతగా ఉంటుంది. ఇది కూడా నిలకడగా నడవ లేని స్థితికి కారణమవుతూ ఉంటాయి. కాకపోతే ఓ ఐదారు రకాల వ్యాయామాల ద్వారా ఈ సమస్యలను అధిగమించే అవకాశాలు ఉన్నాయి.
ఆ వ్యాయామాల్లో కొన్ని….
కుర్చీ వెనుక భాగం మీద ఎడమ అరచేయి మోపి, ఎడమ కాలును నిటారుగా ఉంచి, కుడి కాలును నేలకు 6 నుంచి 12 అంగుళాల ఎత్తుకు లేపాలి. కొన్ని క్షణాల పాటు అలాగే ఉంచి దించేయాలి. ఇలా 8 నుంచి 12 సార్లు (రిపిటీషన్స్‌) చే యాలి. రెండవ వైపున కూడా అలాగే చేయాలి.
కుర్చీమీద కుడి చేయి ఉంచి నిలబడి, కుడికాలును వెనుక వైపు మడిచి, నేలకు సమాంతరంగా పైకి లేపాలి. 10 క్షణాల పాటు అలాగే ఉంచి, కాలును నేల పైన మోపాలి. అలా 15 సార్లు చేసి , ఆ తర్వాత రెండవ వైపు కూడా చేయాలి.
కుర్చీ సపోర్టుతో నిలబడి. కుడి కాలు మడిచి ఎడమ మోకాలి దాకా పైకి లేపి. కొన్ని క్షణాల పాటు అలాగే ఉండాలి. అలా 15 సార్లు చేయాలి. రెండవ వైపున కూడా అలాగే చేయాలి. ఆ తర్వాత ఇవే వ్యాయామాలను కుర్చీ ఆధారంగా కాకుండా, గోడపై చేయి ఆనించి కూడా చేయవచ్చు.