జిమ్‌కార్బెట్‌ నేషనల్‌ పార్క్‌… ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో ఎంతో పేరున్న పర్యాటక ప్రదేశం. టైగర్‌ రిజర్వ్‌గా ఎంతో ప్రసిద్ధి. స్థానికులకు ఓ ఆటవిడుపు. చుట్టుపక్కల ప్రదేశాల నుంచి ఎంతో మంది వీకెండ్స్‌లో ఈ ట్రిప్‌లకు వెళ్లడం పరిపాటి. అంతేకాదు ఈ జాతీయ పార్క్‌ చుట్టూ వెలసిన రిసార్టులు ఉండడంతో డెస్టినేషన్‌ వెడ్డింగ్స్‌కు కాబోయే వధూవరులు క్యూ కడుతున్నారు కూడా. మరి పర్యాటకంగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ జాతీయ పార్కుకు వెళ్లాంటే ఒకటే దారి ఉంది. అదీ ఢిల్లీ నుంచి రామ్‌నగర్‌ మీదుగా ప్రయాణించాలి. ఈ దూరం 240 కి.మీ. ఇంచుమించు అయిదు గంటల సమయం పడుతుంది. త్వరలోనే ఇంకో మార్గం ఏర్పాటు కానుంది. ఈ పార్కులో సఫారీ చేయాలనుకునేవారికి కోట్‌ద్వార్‌ అనే పల్లె సమీపంలోని పఖారో అనే ద్వారం ద్వారా ప్రవేశం కల్పించనున్నారు. దీని ద్వారా సుమారు 80 కి.మీ దూరం తగ్గిందని అంచనా. త్వరలోనే ఈ కొత్త రూట్‌ సందర్శకులకు అందుబాటులోకి రానుంది.