ప్రకృతి మనకు చాలానే ఇస్తోంది.. ఎంతో కొంత మనమూ తిరిగి ఇచ్చేయాలి… లేకుంటే… బతుకే భారం అవుతుంది. చిక్కి సగమైపోతాం!
అందుకు కనిపిస్తున్న ఫొటోనే సాక్ష్యం.. ‘మొన్నీ మధ్యే ఎక్కడో చూశాం!’ అనుకుంటున్నారా?
కరెక్టే… కేరళలో. సభ్య సమాజానికి ప్రకృతి పంపిన పిక్చర్‌ మెసేజ్‌
అది చూశాక మీకేమనిపించింది? ఆలోచించారా? మీ బాధ్యతేంటో గ్రహించారా? సమయం మించిపోలేదు ఫ్రెండ్స్‌..
ప్రకృతి ఒడిలో ప్రేమని తీసుకుంటూనే… తిరిగి ఇచ్చేద్దాం! అందుకు చాలానే చేయొచ్చు.

చిన్నప్పుడు పాకిన ఇంటి వసారా.. తప్పటడుగులు వేసిన వాకిలి.. గెంతుతూ తిరిగిన వీధి.. సైకిల్‌పై చక్కర్లు కొట్టిన కాలువ వంతెన… కో కో ఆడిన స్కూల్‌ మైదానం.. టీ20లతో సిక్స్‌లు.. ఫోర్‌లు బాదిన కాలేజీ గ్రౌండ్‌… అన్నీ ఒక్కసారిగా.. జలమయం. రెండు మూడు రోజులు కానరాని ఆనవాళ్లు… అన్నీ జ్ఞాపకాలయ్యాయి. అంతా అయోమయం. పచ్చని ప్రకృతిలో పిచ్చుకల్లా ఎగిరిన వారంతా బిక్కుబిక్కుమంటూ పునరావాసాల్లో దాక్కున్నారు. అయ్యో అన్నాం.. మానవత్వం చూపాం.. చేయీ చేయీ కలిపాం.. సాయం అందించాం. అంతేనా? ఇంకేం లేదా? అప్పుడెప్పుడో వైజాగ్‌… ఇప్పుడు కేరళ.. తర్వాత?? మరో చోట. ఇంకో రకంగా! అసలీ ప్రకృతి విపత్తులు ఎందుకు వస్తున్నాయ్‌? సింపుల్‌… మనం మనచుట్టూనే తిరుగుతున్నాం. మన వరకే ఆలోచిస్తున్నాం. మనకేం కావాలో తెలుసుకునేందుకునే అందరి అన్వేషణ. ఈ నేపథ్యంలో అమ్మ ఒడిలాంటి ప్రకృతి ఒడిని పూర్తిగా విస్మరిస్తున్నాం. మీకు గుర్తుందా? మన్ను తిన్న రోజులు… బురదలో వేసిన కప్పగెంతులు.. ఏమైందా కనెక్షన్‌?

* చెప్పుల్ని వదిలి పాదాలు… మట్టిని తాకింది చివరిగా ఎప్పుడు?
* మౌస్‌ని వదిలి సీతాకోక చిలుక రెక్కల్ని సుకుమారంగా తాకిందెప్పుడు?

* తాకేతెరపై నడియాడే మునివేళ్లు మొక్కల్ని మమకారంగా నిమిరిందెప్పుడు?.. ఆలోచిస్తున్నారా? ప్రకృతి నుంచి తీసుకోవడానికే అలవాటు పడి… తిరిగి ఇవ్వాలనే ధ్యాసనే కోల్పోయాం. ఓపికకూ ఓ హద్దుంటుంది. ఎన్నని.. ఎన్నేళ్లని ప్రకృతి తనలో ఐక్యం చేసుకుంటుంది. విసుగొచ్చిన విరుచుకు పడుతుంది. అంతదాకా రాకూడదంటే? తీసుకోవడమే కాదు.. ప్రకృతికి తిరిగి ఇవ్వడంలోనూ ఆనందం వెక్కుకుందాం!!

* కాలేజీ బ్యాగులో ఛార్జర్‌, పవర్‌బ్యాంకు, పుస్తకాలతో పాటు మీకు ఇష్టమైన బుజ్జి ప్లేటుని పెట్టండి. ఫ్రెండుతో పానీపూరీనో.. ఛాట్‌ మాసాలానో తిందాం అనుకున్నప్పుడు బ్యాగులోని ప్లేటునే వాడండి. దీంతో ఏడాదంతా కనీసం ఓ రెండు వందల ప్లాస్టిక్‌ ప్లేట్స్‌ని ప్రకృతి ఒడిలోకి రాకుండా ఆపొచ్చు.

* పేరెంట్స్‌ మీటింగ్‌లు, కాలేజీ ఫంక్షన్స్‌లో హాజరయ్యేందుకు వచ్చిన వారికి ముగింపు రోజున చిన్న ప్యాకెట్స్‌లో పలు రకాల విత్తనాల్ని ఇవ్వండి. వెళ్లే దార్లో ఎక్కడైనా ఖాళీ ప్రాంతాల్లో వాటిని జల్లమని కోరండి. కొన్ని వందల చెట్లని ప్రకృతికి జత చేసినవారవుతారు.

* చెట్టుకు నీరెంత ముఖ్యమో. వాటిపై ఆడే పక్షులకూ నీరంతే అవసరం. క్యాంపస్‌లోని అన్ని చెట్లకింద నీళ్లు పెట్టండి. అదీ రీసైకిల్‌ చేసిన బాటిల్‌ గిన్నెలతో!! క్రియేటివ్‌గా కొమ్మలకు కట్టండి. ఓ సెల్ఫీతీసి పోస్ట్‌ చేయండి.
నీళ్ల బాటిల్‌ తాగేశాక వంతెనలు, నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశాల్లో పడేస్తుంటారు. అలా చేయకుండా.. బాటిల్‌ని మీదైన పద్ధతిలో రీసైకిల్‌ చేయండి. బాటిల్‌ పెద్దగా ఉంటే దాంట్లో మొక్కల్ని నాటే ప్రయత్నం చేయొచ్చు.

* కాలేజీ, స్కూళ్లలో గేటుకి ఇరువైపులా నిలబడి స్వాగతం చెప్పే చెట్లు మొదలుకుని.. మొత్తం కాంపౌండ్‌లో ఎన్ని చెట్లున్నాయో ఎప్పుడైనా లెక్కించారా? ఒక్కసారి గణించండి. ఒక్కొక్కరికీ ఒక్కో మొక్కుంటే మీకు తోడు దొరికినట్టే. అలా కాకుంటే వెంటనే మీ కోసం ఓ మొక్క నాటండి.

* కాలేజీ, స్కూళ్లలో గేటుకి ఇరువైపులా నిలబడి స్వాగతం చెప్పే చెట్లు మొదలుకుని.. మొత్తం కాంపౌండ్‌లో ఎన్ని చెట్లున్నాయో ఎప్పుడైనా లెక్కించారా? ఒక్కసారి గణించండి. ఒక్కొక్కరికీ ఒక్కో మొక్కుంటే మీకు తోడు దొరికినట్టే. అలా కాకుంటే వెంటనే మీ కోసం ఓ మొక్క నాటండి.

* బయటికి వస్తే చాలు. ముఖానికి ఒకటి.. తలకొకటి.. స్కార్ఫ్‌లు. చేతికేమో గ్లౌజ్‌లు. ఇలా మన అందం, ఆరోగ్యం పాడవకూడదని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ, ప్రకృతి అందాన్ని కాపాడేందుకు ఏం చేస్తున్నాం? సింపుల్‌… ప్లాస్టిక్‌కి ‘నొ’ చెబుతూ… రోడ్డు పక్క బండిపై కొన్న యాపిల్‌ పళ్లను స్కార్ఫ్‌ల్లో మూటగట్టుకుని వెళ్లండి. ఏడాది మొత్తంలో కొన్ని వందల ప్లాస్టిక్‌ కవర్లను భూదేవీ ఒడిలో చేరకుండా అడ్డుకోవచ్చు.

* స్కూలు, కాలేజీల్లో గ్రూపులుగా పిక్నిక్‌లకు వెళుతుంటాం. వెళ్లిన చోట ముందే కొన్ని బోర్డులు తయారు చేసి అందరికీ కనిపించేలా పెట్టండి. అదేంటంటే.. ‘మనం ఈ చోటు విడిచి వెళ్లేటప్పుడు.. వచ్చినప్పటికంటే మరింత శుభ్రంగా ఉండేలా బాధ్యతగా నడుచుకోమని’.

* కాలేజీ బస్సుల్లో రోజూ వెళ్తుంటాం. తాగేసిన కోక్‌ టిన్‌ని వెనకా ముందు ఆలోచించకుండా కిటికీలో నుంచి బయట పడేస్తాం. లేదంటే కూర్చున్న సీటు కిందే వదిలేస్తాం. నమిలేసిన బబుల్‌గమ్‌ని ముందు సీటు కిందో, వెనుకో అతికించేస్తాం. అలా కాకుండా.. ఓ చెత్తబుట్టని కాలేజీ బస్సుల్లో అందరికీ కనిపించేలా అందంగా అలంకరించి అమర్చండి. దాంట్లోనే చెత్తని వేయండి.  రోజుకి ఒకరు బాధ్యత తీసుకుని చెత్తని మున్సిపాలిటీ చెత్త కుండీల్లో పడేయండి.

* శుభకార్యాలు, పండగల సందర్భంగా ఇంటినెలా శుభ్రం చేసుకుంటామో… మీరు నిత్యం కూర్చుని ఊసులాడుకునే అడ్డాలనూ క్లీన్‌ చేయండి. ఉదాహరణకు మీ కాలేజీ, స్కూల్‌ క్యాంపస్‌ల్లో కూర్చునే పిట్టగోడల్ని అందమైన రంగులతో అలంకరించి. ఒకటి రెండు మొక్కలు నాటండి. వాటినీ మీ బ్యాచ్‌లో సభ్యులుగా చేర్చుకుని పేర్లు పెట్టండి. మీరు ఉన్నంత కాలం సంరక్షించి తర్వాత జూనియర్లకు బాధ్యత అప్పగించండి. మీరెప్పుడు క్యాంపస్‌కి వెళ్లినా వాటి పలకరింపులు చెప్పలేని ఆనందాన్నిస్తాయి.

* ప్రకృతి గొప్పదనాన్ని తెలిపేలా కవితలు, కథలు, పాటలు రాసి కాలేజీ ఫంక్షన్స్‌లో ప్రదర్శించండి. రోజూ క్లాస్‌రూంలోని బ్యాక్‌బోర్డుపై ఓ కవితో, కొటేషనో రాయండి.

* కాలేజీకి వెళ్లే బైక్‌ వెనక పలు రకాల మెసేజ్‌లు, ఇష్టమైన వ్యక్తుల బొమ్మల్ని స్టికర్ల రూపంలో అతికిస్తాం. ఆ స్థానంలో ప్రకృతికీ చోటిద్దాం. నేచర్‌కి ఉన్న ప్రాధాన్యత చెబుతూ బొమ్మలు, మెసేజ్‌లు అతికించండి.

* మీరున్న ప్రాంతంలో నదులు, సముద్రాలుంటే వాటిని శుభ్రం చేసే బాధ్యత తీసుకోండి. బృందాలుగా ఏర్పడి వాటిని మీరే దత్తత తీసుకోండి. ఇతరుల్నీ ప్రేరేపించేలా శుభ్రం చేసిన ప్రాంతంలో స్పెల్ఫీలు దిగుతూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయండి.

* మొక్క నాటుతూ.. నీళ్లు పోస్తూ సెల్ఫీలకు ఫోజులివ్వడం. సోషల్‌ వీడియాలో షేర్‌ చేయడం. తర్వాత నాటిన మొక్క ఏమైందో అనే ధ్యాసకంటే..  లైక్‌లు, కామెంట్‌లను చూసే ధ్యాసే ఎక్కువ అవుతుంది. నాటడానికి పట్టేది రెండు నిమిషాలే.. బతికి అది ఓ వృక్షం అయ్యేందుకు చేసేది పోరాటం.  ఇప్పుడు మనం చూస్తున్న వృక్షాలన్నీ ఎందరో మంచి మనుషులు చేసినా పోరాటాల ఫలితం. మరి, మీది ప్రయత్నమా? పోరాటమా?

* నెలలో ఒకరోజుని ‘ఎర్త్‌డే’గా పరిగణిస్తూ ఆ రోజంతా విద్యుత్‌ వాడకాన్ని నివారించాలి. ఆ రోజు ఫోన్‌లో ఛార్జింగ్‌ లేకున్నా ఛార్జింగ్‌ పెట్టకూడదు. కంప్యూటర్‌ని వాడకుంటే స్వీచ్‌ఆఫ్‌ చేయడం. లేదంటే.. కనీసం మానిటర్‌ని  ఆఫ్‌ చేయండి. లిఫ్ట్‌ని వాడే క్రమంలో దిగ్గానే ఫ్యాన్‌, లైట్‌ ఆఫ్‌ చేయండి. కాలేజీ, స్కూల్‌, అపార్ట్‌మెంట్‌ల్లోని లిఫ్ట్‌ల్లో ‘యూజ్‌ లెస్‌ అండ్‌ లిఫ్ట్‌ యువర్‌ లైఫ్‌’ అని రాసిపెట్టండి.

* గార్డెనింగ్‌ని ఓ హాబీగా చేర్చండి. మనల్ని విడిచి వెళ్లిపోయిన ఆప్తుల పేరుతో ఓ మొక్క నాటండి. పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములైపోండి.