అత్యంత చిన్న వయసులో గ్రాండ్‌మాస్టర్‌గా ఎదిగిన తొలి భారత ఆటగాడు, తెలుగు రాష్ట్రాల తొలి గ్రాండ్‌మాస్టర్.. పెంటేల హరికృష్ణ. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత నంబర్ టూగా దేశంలో చెస్‌కు ఆదరణ తేవడంలో హరిది కీలకపాత్రే. కామన్వెల్త్ విజేతగా, ప్రపంచ జూనియర్, ఆసియా ఛాంపియన్‌గా ఎన్నో ఘనతలు సాధించిన హరి.. ఆర్నెల్ల క్రితమే ఓ ఇంటివాడయ్యాడు. సెర్బియాకు చెందిన నదెద్జాను పెళ్లాడాడు. ఒకప్పటి ఆనంద్‌లా విదేశాలకు మకాం మార్చిన హరి.. ఇప్పుడేం చేస్తున్నాడు? కొత్త వైవాహిక బంధం గురించి ఏం చెప్తున్నాడో తెలుసుకుందామా..!* నదెద్జాతో వివాహం తర్వాత తొలి మేజర్ టోర్నీ ఆడుతున్నారు. ఎలా సిద్ధమయ్యారు?
చెస్ ఒలింపియాడ్‌లో ఈసారి కచ్చితంగా పతకం తేవాలన్న లక్ష్యంతో ఉన్నాం. విశ్వనాథన్ ఆనంద్, నేను, విదిత్ సంతోష్ గుజరాతి, అధిబన్, శశికిరణ్ భారత్ తరఫున బరిలో ఉన్నాం. రేటింగ్ ప్రకారం భారత్ బలంగా ఉంది. పతకం వచ్చే అవకాశాలూ ఉన్నాయి. ఆటగాళ్ల ఫామ్ కీలకం. భారత్‌తో పాటు మరో ఐదారు దేశాలు బలంగా ఉన్నాయి. అమెరికా, రష్యా, చైనా, ఉక్రెయిన్, అర్మేనియాలకు టైటిల్ గెలిచే సత్తా ఉంది. అమెరికా జట్టులో కరువానా, నకముర, సో వెస్లీ మంచి ఆటగాళ్లు. భారత మహిళల జట్టు కూడా బలంగా ఉంది. ఈసారి హంపి కూడా ఆడుతుండటంతో భారత్ స్వర్ణంపై గురిపెట్టింది. మహిళల జట్టుకు పతకావకాశాలు అధికం.
* పెళ్లి తర్వాత జీవితంలో ఎలాంటి మార్పులొచ్చాయి?
పెద్దగా మార్పులేమీ లేవు. పెళ్లికి ముందు వండుకుని తినేవాడిని. ఇప్పుడు వండితే తింటున్నా. అంతే తేడా!
* హనీమూన్‌కు వెళ్లారా?
కేరళకు వెళ్లాం. ఐతే అక్కడ ఎక్కువ రోజులు ఉండలేకపోయాం. టోర్నీలు ఉండటంతో ప్రేగ్ (చెక్ రిపబ్లిక్)కు రావాల్సొచ్చింది. ఒలింపియాడ్ కోసం నిర్వహించిన శిక్షణ శిబిరాల కోసం భారత్‌కు వచ్చా. నదెద్జాకు భారత్‌లో ప్రదేశాలంటే చాలా ఇష్టం. కొంచెం వీలు చూసుకుని భారత్‌లోని ప్రముఖ ప్రదేశాలన్నీ చూడాలనుకుంటున్నాం.
* కొత్త కాపురం.. చెస్‌ను ఎలా సమన్వయం చేసుకుంటున్నారు?
నదెద్జా వాళ్లది కూడా చెస్ కుటుంబమే. తను, ఆమె చెల్లి చెస్ క్రీడాకారిణులే. గంటలకొద్దీ ప్రాక్టీసులో మునిగిపోవడం.. టోర్నీలు ఆడటం వాళ్లకు అలవాటే. అందుకే మాకేమీ కొత్తగా.. ఇబ్బందిగా అనిపించట్లేదు. ప్రాక్టీసు, టోర్నీలపై ఎంత శ్రద్ధ వహించినా మాకంటూ సమయం ఉంటుంది. సరదాగా గడుపుతాం.
* మీ ఇద్దరికి కాలక్షేపం ఎలా?
ఇంట్లో ఒక కుక్క, 2 పిల్లులు ఉన్నాయి. అప్పుడప్పుడు వాటితోనే నా కాలక్షేపం (నవ్వుతూ).
* వంట ఎవరు చేస్తారు?
నాకు వంట చేయడం అస్సలు రాదు. పెళ్లికి ముందు ఎలాగోలా నడిచిపోయింది. ఇప్పుడు తనే వంట చేస్తుంది. రోజువారీ సలాడ్స్, మెడిటేరియన్ ఆహారం తయారు చేస్తుంది. భారత పండుగలు వచ్చినప్పుడు సంప్రదాయ వంటలు వండేందుకు ప్రయత్నిస్తుంది.
* నదెద్జా ఎలాంటి వంటలు చేస్తుంది?
ఆమెకు వంట చేయడమంటే ఇష్టం. ఉత్తర, దక్షిణ భారత్, మెక్సికన్ వంటకాలు వచ్చు. యూట్యూబ్‌లో చూసి వంటలపై పట్టు సాధిస్తోంది. అద్భుతంగా చేస్తుందని చెప్పను. కానీ బాగా చేసేందుకు ప్రయత్నిస్తుంది. ప్రయోగాలు చేస్తుంది. భారతీయ వంటకాలు ఎక్కువ నేర్చుకుంటోంది. సమోసా, మసాలా టీ చేస్తుంది. నేను కారం తక్కువ తింటా. తను నాకంటే తక్కువ తింటుంది. నాకు బెండకాయ కూర అంటే ఇష్టం. ఇక్కడ ఎక్కువగా దొరకదు. ఎప్పుడైనా బెండకాయ దొరికితే పండుగే.
* విదేశీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇంట్లోవాళ్లను ఎలా ఒప్పించారు?
మా పెళ్లి ఎలా అని మొదట్లో నాక్కూడా అనుమానాలు ఉండేవి. ఒప్పుకుంటారో లేదో అని అనుకున్నా. భిన్న సంస్కృతి, భిన్న మతం. తొందరగా ఒప్పుకోరని తెలుసు. కానీ ఒప్పించగలనన్న నమ్మకం నాకుండేది. తొలుత వద్దన్నారు. తర్వాత సరే అన్నారు. తనతో మాట్లాడిన తర్వాత అమ్మానాన్న మరింత సంతోషించారు.
* ఎప్పుడు ప్రేమలో పడ్డారు?
జూనియర్ స్థాయిలో నాతో పాటు తను కూడా ఆడేది. టోర్నీలకు వెళ్లినప్పుడు చూడటమే కానీ మాట్లాడుకోలేదు. తర్వాత తను చెస్ మానేసింది. ఒక టోర్నీలో మళ్లీ కనిపించింది. నదెద్జా చెల్లి ఆ టోర్నీలో ఆడుతుండటంతో ఆమెకు తోడుగా తను వచ్చింది. అప్పుడు మాటలు కలిశాయి. ఆ తర్వాత తరచూ మాట్లాడుకునేవాళ్లం. మా అభిరుచులు, అభిప్రాయాలు ఒక్కటవ్వడంతో పెళ్లితో కలిశాం. ప్రేమ అని చెప్పడం కంటే స్నేహితులుగా మెలిగాం.
* భారతీయ సంప్రదాయం ప్రకారం పెళ్లనగానే నదెద్జా ఎలా స్పందించింది?
భారత వివాహ వ్యవస్థపై నదెద్జాకు గౌరవం ఉంది. పెళ్లి గురించి యూట్యూబ్‌లో చాలా వీడియోలు చూసింది. పెళ్లిలో ఏమేం కార్యక్రమాలు ఉంటాయో తెలుసుకుంది. స్వయంగా పెళ్లి అనుభూతుల్ని ఆస్వాదిస్తున్నప్పుడు చాలా ఆనందపడింది. కొంచెం కంగారు పడింది. మొత్తానికి బాగా ఆస్వాదించింది.
* కెరీర్ పరంగా నదెద్జా నుంచి మీకెలాంటి సహకారం లభిస్తుంది?
చెస్ క్రీడాకారిణిగా తనకు ఆటపై అవగాహన ఉంది. నా కోసం స్టడీ మెటీరియల్ సిద్ధం చేస్తుంది. చెస్24 వెబ్సైట్లో లైవ్ మ్యాచ్‌లు అవుతుంటాయి. నాకు అన్ని మ్యాచ్‌లు చూడటం కుదరదు. తను అన్నీ చూసి.. కొన్ని పాయింట్లు రాసుకుంటుంది. ముఖ్యమైనవి నాకు చెప్తుంది. టోర్నీలు, క్రీడాకారులకు సంబంధించిన సమాచారం ఇస్తుంది. గేమ్‌ల సమయంలో తన చిట్కాలు ఉపయోగపడుతుంటాయి.
* ఇప్పుడు నదెద్జా ఏం చేస్తోంది?
ఫిడె ఆర్బిటర్‌గా వ్యవహరిస్తోంది. అంతర్జాతీయ ఆర్బిటర్ అవడం తన లక్ష్యం. మరో 2 టోర్నీలు ఫిడె ఆర్బిటర్‌గా పనిచేస్తే అంతర్జాతీయ హోదా వస్తుంది. 2019లో తనను అంతర్జాతీయ ఆర్బిటర్‌గా చూడొచ్చు.
* భార్య ఆర్బిటర్.. భర్త క్రీడాకారుడిగా బరిలో దిగితే ఎలా ఉంటుంది?
నేనాడే టోర్నీల్లో అధికారిగా వ్యవహరించాలంటే అంతర్జాతీయ ఆర్బిటర్ అయ్యుండాలి. కొన్ని చోట్ల ఫిడె ఆర్బిటర్ కూడా ఉంటారు. ఇప్పటి వరకు తను ఆర్బిటర్‌గా, నేను క్రీడాకారుడిగా ఒకే టోర్నీలో బరిలో దిగలేదు. ఆ రోజు వచ్చినా భిన్నంగా అనిపించకపోవచ్చు. చెస్ ప్రొఫెషనల్ క్రీడ. మేధో సంబంధిత ఆట. ఫుట్‌బాల్, రగ్బీ మాదిరి శారీరక శ్రమ ఉండదు. చెస్‌లో ఆర్బిటర్ పని కూడా తక్కువే. ఎప్పుడో ఒకసారి క్రీడాకారుడు తన నిరసన తెలుపుతాడు. అంతే. అప్పటికీ నిబంధనల ప్రకారమే ఆర్బిటర్ నడుచుకోవాలి. సొంత నిర్ణయాలు ఉండవు.
* పెళ్లి తర్వాత మీ ఆటలో మార్పొచ్చిందా?
ఆట మెరుగైంది. టాప్-10కు చేరుకున్నా. ఇంకా పురోగతి రావాలి. రేటింగ్ పెరిగినా, తగ్గినా ప్రదర్శనలో వచ్చిన మార్పు తెలిసిపోతుంది. ఆట మెరుగైందో లేదో అర్థమవుతుంది. రేటింగ్ మెరుగైనా కాకున్నా ఆటను ఆస్వాదించడం నేర్చుకున్నా. ఆడటం వరకే మన పని. ఫలితం మన చేతుల్లో ఉండదు. అత్యుత్తమంగా ఆడాలి. గెలుపు కోసమే ప్రయత్నించాలి. ఇప్పుడు నా ఆటలో మరింత పరిణతి కనిపిస్తోంది. అన్నింటినీ సానుకూలంగా తీసుకుంటున్నా.
* వివాహానికి ముందు ఓటములు ఎదురైనప్పుడు చిరాగ్గా అనిపించేదా?
ఓటమి ఎప్పుడైనా బాధాకరమే. పెళ్లికానప్పుడు ఆలోచనలు ఎక్కువగా ఉండేవి. రాత్రి పడుకునే ముందు గేమ్‌కు సంబంధించిన ఆలోచనలు వస్తుండేవి. అలా ఆడివుంటే బాగుండేది.. ఇలా ఆడకుండా ఉండాల్సిందన్న ఆలోచనలు మెదులుతాయి. ఆ కారణంగా ఉదయం ఉత్సాహంగా అనిపించదు. ఇప్పుడు అలా లేదు. చాలా ఆనందంగా ఉన్నా. ఓడినా పెద్దగా బాధపడటం లేదు.
* మీ ఇద్దరిలో ఎక్కువ ప్రభావవంతమైన వ్యక్తి?
మా ఇద్దరిలో తనే ఎక్కువ ప్రభావవంతమైన వ్యక్తి. నా కెరీర్, జీవితంలో ఆమె నిర్ణయాలు కీలకం. ఎంత శాతం అని చెప్పను. పరిస్థితులకు తగ్గట్లు శాతం మారుతూ ఉంటుంది. నా ప్రయాణాలు, టోర్నీలు తనే చూసుకుంటుంది.
* హైదరాబాద్‌ను నదెద్జా ఎలా ఆస్వాదించింది?
హైదరాబాద్‌లో 20 రోజులు ఉంది. గోల్కొండ కోటకు వెళ్లాం. బిర్లా మందిర్, ఫిల్మ్‌నగర్ దైవ సన్నిధానం చూశాం. శిల్పారామం తనకు బాగా నచ్చింది. భిన్నమైన కళలు తనని ఆకట్టుకున్నాయి. గోల్కొండ కోట కూడా తనలో ఆసక్తి రేకెత్తించింది.
పెళ్లి తర్వాత ఆట మెరుగైంది. ఆటను ఆస్వాదించడం నేర్చుకున్నా. ఇప్పుడు నా ఆటలో పరిణతి కనిపిస్తోంది. అన్నింటినీ సానుకూలంగా తీసుకుంటున్నా. ర్యాంకింగ్స్‌లో టాప్-10కు చేరుకున్నా. ఇంకా పురోగతి రావాలి. |
నదెద్జాకు ఇంకా తెలుగు పూర్తిగా రాదు. కొన్ని పదాలు అర్థమవుతాయి. కొంచెం కొంచెం మాట్లాడుతుంది. కొద్ది కాలంలోనే తెలుగు పూర్తిగా నేర్చుకుంటుంది. |
చదరంగంలో మా పాత్రలు..
చెస్ బోర్డులో తన స్థానమేంటో చెప్పడం కష్టం. వెనకాల ఉండి పనిచేయడమంటే తనకు ఇష్టం. బహుశా రాణి అనుకోవచ్చు. నిశ్శబ్ధంగా ఉంటూ తన పని తను చేసుకుపోతుంది. నేను రాజు మాదిరి. ఎక్కువ తిరగలేపోయినా అత్యంత కీలకం. సందర్భానికి తగ్గట్లు మేమిద్దరం కలిసి నిర్ణయాలు తీసుకుంటాం. ఆర్థిక పరమైన నిర్ణయాలన్నీ తనే చూసుకుంటుంది. నిర్వహణ, ప్రణాళిక, ఏర్పాట్ల విషయంలో తను నాకంటే మెరుగు. రాణి వేగంగా కదులుతుంది. రాజు మెల్లిగా వెళ్తాడు. అందుకే ఇద్దరి మధ్య సమన్వయం కుదిరింది. కింగ్, క్వీన్లలో ఎవరి అనుకూలతలు వారికి ఉంటాయి. |
ఆటలే కాదు గొడవలూ..
చిన్న చిన్న గొడవలు సహజం. కానీ పోట్లాడుకోం. ఎక్కువసేపు వాదించుకోం. ఏవైనా పొరపాట్లు ఉంటే సర్దుకుంటాం. పొరపాట్లంటే.. మొక్కలకు నీళ్లు పోయడం మరిచిపోవడం, కుక్కను బయటికి తీసుకెళ్లకపోవడం వంటివి. చాలా చిన్న విషయాలు. వెంటనే సర్దుకుని నవ్వుకుంటాం. ఇద్దరం చెస్ క్రీడాకారులమే కాబట్టి కాసేపు నిశ్శబ్ధంగా ఉంటే అన్నీ సర్దుకుంటాయని తెలుసు. – వరికుప్పల రమేశ్
|