సెప్టెంబరు వచ్చిందంటే లేహ్‌ దారిలో పండగ వాతావరణం కనిపిస్తుంది. దేశవిదేశాల నుంచి బౌద్ధులు, భిక్షువులు ఇక్కడికి తరలివస్తారు. వందల్లో.. వేలల్లో.. లక్షల్లో వస్తారు. అంతా లేహ్‌ నగరానికి 40 కిలోమీటర్ల దూరంలోని హెమిస్‌ బౌద్ధ ఆరామానికి చేరుకుంటారు. బౌద్ధ సంప్రదాయానికి, ఇండో-టిబెట్‌ సంస్కృతికి అద్దం పట్టే నారొపా ఉత్సవాల్లో పాలుపంచుకుంటారు. లక్షల మంది బౌద్ధులను ఏకం చేసే నారొపా వేడుకను హిమాలయా కుంభమేళాగా అభివర్ణిస్తారు. 11వ శతాబ్దానికి చెందిన బౌద్ధ భిక్షువు నారొపా ఆరాధనోత్సవాలుగా వీటిని అభివర్ణిస్తారు. ఏటా ఐదురోజుల పాటు సాగే ఈ వేడుకను.. పన్నెండేళ్లకోసారి మరింత ప్రత్యేకంగా నిర్వహిస్తారు. 2016లో పుష్కర సంబరం కాగా, ప్రతి ఏడాదిలాగే ఈసారి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఆటలు, సంప్రదాయ నృత్యాలు, వాద్యాల హోరు, కచేరీలు, సాహస క్రీడలకు వేదికగా నిలవనుంది. రకరకాల ముసుగులతో కళాకారులు ప్రదర్శించే నాట్యవిన్యాసాన్ని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు తరలివస్తారు.
ఎప్పుడు: సెప్టెంబర్‌ 16 నుంచి 20 వరకు
ఎక్కడ: హెమిస్‌ ఆరామం (లేహ్‌ నుంచి 40 కి.మీ)
ఎలా వెళ్లాలి:
* లేహ్‌ వెళ్లాలంటే ముందుగా దిల్లీకి చేరుకోవాలి. అక్కడి నుంచి విమానంలో లేహ్‌కు నాన్‌స్టాప్‌ విమాన సర్వీసులు ఉన్నాయి.
* లేహ్‌కు మనాలి మీదుగా కూడా చేరుకోవచ్చు. మనాలి వెళ్లాలంటే చండీగఢ్‌ చేరుకోవాలి. అక్కడి నుంచి బస్సులో, ట్యాక్సీలో మనాలికి (305 కి.మీ) వెళ్లొచ్చు. మనాలి నుంచి బస్సులోగానీ, ట్యాక్సీలో గానీ లేహ్‌కు (473 కి.మీ) చేరుకోవచ్చు.
* విజయవాడ నుంచి డెహ్రాడూన్‌ మీదుగా చండీగఢ్‌కు రైలు (వీక్లీ) అందుబాటులో ఉంది. హైదరాబాద్‌ నుంచి చండీగఢ్‌కు నాన్‌స్టాప్‌ విమాన సర్వీసులున్నాయి.