ఇప్పుడు భారత ఫుట్‌బాల్‌ జట్టు ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం కూడా కష్టం. కానీ ఒకప్పుడు భారత్‌ సెమీస్‌ వరకు వెళ్లింది. మరెన్నో ప్రతిష్టాత్మక టోర్నీల్లో అద్భుత ప్రదర్శన చేసింది. అలాంటి జట్టులో సభ్యుడైన దిగ్గజ ఆటగాడు ప్రస్తుత భారత ఫుట్‌బాల్‌ దుస్థితిని చూసి చింతిస్తున్నాడు. అలాగే తన దయనీయ స్థితిని ఏకరవు పెడుతున్నాడు. రోడ్డు పక్కన అనాథలా చావాల్సి వస్తుందేమో అని ఆవేదన చెందుతున్నాడు. భారత ఫుట్‌బాల్‌తో పాటు తన జీవితమూ అస్తవ్యస్తమైందంటూ.. నాటి, నేటి సంగతుల్ని ‘విజేత’తో పంచుకున్నాడు హైదరాబాదీ దిగ్గజం తులసీదాస్‌ బలరాం!భారత అత్యుత్తమ ఫుట్‌బాల్‌ జట్టులో సభ్యుడినైందుకు ఎప్పుడూ గర్వపడుతూనే ఉంటా. ఆ రోజుల్లో క్రీడాకారులకు ఆట తప్ప ఇతర ఏ వ్యామోహం ఉండేది కాదు. దేశం కోసం పుట్టాం.. ఏం చేసినా దేశం కోసమే చేయాలి అనే తపన ఉండేది. అందుకే కనీస వసతులు కల్పించకపోయినా.. కాళ్లకు బూట్లు లేకున్నా ఫుట్‌బాల్‌ ఆడాం. ఇప్పుడున్న ఆటగాళ్లను నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు. సాంకేతికంగా వాళ్లు ఉన్నతంగా ఉన్నారు. కానీ దేశం కోసం ఆడే సమయంలో ఉండాల్సిన ఆ తపన కనిపించడం లేదు. ఆధునిక సౌకర్యాలు ఉన్నా ఫలితాలు రాకపోవడానికి కారణం అదే. ఇప్పుడు ఓ పెద్ద టోర్నీలో విజయం సాధిస్తే చాలు కోట్లు కుమ్మరిస్తున్నారు. 1962 ఆసియా క్రీడల్లో మేము స్వర్ణంతో దేశానికి తిరిగి వస్తే అప్పుడు పట్టించుకున్న నాథుడే లేడు. ఓ సమావేశం ఏర్పాటు చేసి కప్పు టీ కూడా ఇవ్వలేదు. అయినా మాకు పట్టింపు ఉండేది కాదు. దేశం మనకేం ఇచ్చిందని కాకుండా.. మనం దేశానికేం ఇచ్చామనే ఆలోచన ధోరణి నాది. దాంతో జాతీయ జట్టు జెర్సీ ఒంటిపై వేసుకొని బరిలో దిగితే చాలు గర్వంగా అనిపించేది. ఆటగాళ్లు నిబద్ధతతో ఉండేవారు. 1956 మెల్‌బోర్న్‌ ఒలింపిక్స్‌లో సెమీస్‌ వరకూ వెళ్లగలిగాం. 1962 ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచాం. 1960 ఒలింపిక్స్‌లో ఫ్రాన్స్‌ లాంటి దిగ్గజ జట్టును కట్టడి చేశాం. ప్రస్తుతం ఆటగాళ్లు మైదానంలో గోల్స్‌ చేయడంతో పాటు నటనా కౌశలాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రత్యర్థి ఆటగాడు తగలకపోయినా ఏదో జరిగినట్టు గొప్పగా నటిస్తున్నారు. మా రోజుల్లో ఇలాంటివి ఏం చేసేవాళ్లం కాదు. ప్రత్యర్థి ఆటగాడు కవ్వించినా ఆటతోనే సమాధానం చెప్పేవాళ్లం.

క్యాన్సర్‌తో పోరాడుతూ..

నన్ను ఆటలోకి తెచ్చింది.. గుర్తింపు తీసుకొచ్చింది అప్పటి భారత్‌ కోచ్‌ రహీం. అప్పటి సికింద్రాబాద్‌లోని అమ్ముగూడ మా స్వస్థలం. అక్కడే ఫుట్‌బాల్‌ ఆడేవాళ్లం. హైదరాబాద్‌ జట్టు అప్పట్లో గొప్ప జట్టుగా పేరు తెచ్చుకుంది. అందులో సికింద్రాబాద్‌ ఆటగాళ్ల ప్రాతినిధ్యం ఉండేది కాదు. అయితే ఓ రోజు హైదరాబాద్‌ జట్టులో ఆటగాళ్లు తక్కువ ఉన్నారంటే నేను మ్యాచ్‌ ఆడా. మ్యాచ్‌ గెలిచి సంబరాల్లో ఉండగా.. ఓ వ్యక్తి నన్ను పిలిచాడు. ‘‘బాగా ఆడుతున్నావ్‌. నిన్నెప్పుడూ ఇక్కడ చూడలేదు. అవకాశం ఇస్తే ఆడతావా’’ అని అడిగాడు. సంతోషంగా సరే అన్నా. ఆ వ్యక్తే రహీం. అక్కడి నుంచి ఆయనే నా దైవం. మా ఇంటి నుంచి మైదానానికి 25 కి.మీ దూరముండేది. రహీం రోజూ సైకిల్‌ అద్దెకు డబ్బులిచ్చేవాడు. అలా మొదలైన మా అనుబంధం ఆయన చివరి క్షణాల వరకు కొనసాగింది. ఆటగాళ్ల ప్రతిభను వెలుగులోకి ఎలా తీసుకురావాలో రహీంకు బాగా తెలుసు. ఆయన లేకుంటే భారత ఫుట్‌బాల్‌లో ఆ స్వర్ణ యుగమే ఉండేది కాదు. 1962 ఆసియా క్రీడల్లో లీగ్‌ దశలో ఓడిన దక్షిణ కొరియాతోనే ఫైనల్‌ ఆడాల్సి వచ్చింది. మ్యాచ్‌కు ముందు ఆయన చెప్పిన మాటలు మా రక్తాన్ని వేడెక్కించాయి. ఎప్పుడూ మైదానంలోకి వెళ్లి గెలుద్దామా అనే కాంక్షను రగిల్చాయి. అప్పటికాయన క్యాన్సర్‌తో చివరి దశలో ఉన్నారు. అయినా మా వెన్నంటి ఉండి పసిడి గెలిచేలా చేశారు. అలాంటి నిబద్ధత ఎవరికి ఉంటుంది?

పల్లె ప్రతిభను పట్టుకురావాలి..

భారత ఫుట్‌బాల్‌ పూర్వ వైభవం సాధిస్తుంది. కానీ స్వార్థం కోసం పనిచేయని ఫుట్‌బాల్‌ సంఘాల అధికారులు ఉన్నపుడు, జట్టు ఎంపికలో ఎవరూ వేలు పెట్టనపుడు, ప్రతిభావంతులైన ఆటగాళ్లను తొక్కనపుడు, ఆటగాళ్లు దేశం కోసమే ఆలోచించి విజయాలు సాధించినపుడే అది సాధ్యం. ఇప్పుడిప్పుడే ఈ కల నెరవేరకపోవచ్చు. ప్రస్తుతం కోట్లు ఖర్చు చేసి కోచ్‌లను తెస్తున్నారు. అసలు ఆటగాళ్లు లేనపుడు కోచ్‌లు ఎందుకో అర్థం కావడం లేదు. గ్రామాలకు వెళ్లి మరుగున పడిపోతున్న ఆటగాళ్ల ప్రతిభను వెలుగులోకి తేవాలి. పట్టణాలతో పోలిస్తే పల్లెల్లోని వారికి శారీరక సామర్థ్యం ఎక్కువ. ఎంతసేపైనా అలసిపోకుండా ఆడగలరు. అలాంటి వాళ్లను పట్టుకొచ్చి అత్యుత్తమ శిక్షణ ఇప్పించాలి.

మమ్మల్ని మర్చిపోయారు

కోచ్‌ రహీంతో పాటు మా తరం ఆటగాళ్లను అందరూ మర్చిపోతున్నారు. ఈ తరం వాళ్లకు మా గురించి అవసరం లేనట్లుంది. మా గురించి ప్రస్తుత ఆటగాళ్లకు చెప్పేవాళ్లు కూడా లేరు. ప్రభుత్వం కూడా మమ్మల్ని మర్చిపోయింది. ఇప్పటి ఆటగాళ్లకు ప్రోత్సహకాలు ఇవ్వండి. కానీ మమ్మల్నీ గుర్తించాలి. అయినా మేం కోట్ల రూపాయాలు అడగట్లేదు. వృద్ధాప్యంలో వైద్య అవసరాల కోసమే అడిగాం. ఒలింపిక్‌ లాంటి ప్రతిష్టాత్మక ఈవెంట్లో భారత జట్టును సెమీస్‌ చేర్చిన మేం.. దిక్కూమొక్కూ లేకుండా అనాథాల్లా రోడ్డు పక్కన చావాల్సి వస్తుందేమోనని మా భయం. తంగరాజు పరిస్థితి అలాగే అయింది. సమయానికి ఆసుపత్రికి చేర్చేందుకు అంబులెన్స్‌ లేక చనిపోయాడు. అలాంటి దుస్థితి మరెవరికి రాకూడదనే కోరుకుంటున్నా.

ఆ మ్యాచ్‌ చూసి మారిపోయా

1956 ఒలింపిక్స్‌ తర్వాత మా ఇంటికి కోల్‌కతాలోని క్లబ్‌ల ప్రతినిధులు వచ్చి అక్కడికి రమ్మని ఆహ్వానించారు. కానీ వెళ్లలేదు. అయితే ఓ సారి ఓ పర్యటన కోసం కోల్‌కతా వెళ్లను. అప్పుడు వర్షం పడుతున్నా ఆటగాళ్లు మ్యాచ్‌ ఆడుతున్నారు. వాళ్లను ప్రోత్సహిస్తూ దాదాపు 40 వేల మంది అభిమానులు మైదానంలో కేరింతలు కొడుతున్నారు. ఆ దృశ్యం చూశాక కోల్‌కతాలో క్లబ్‌ తరపున ఆడాలని నిర్ణయించుకున్నా. కోల్‌కతాలో క్లబ్‌కు ఆడితే వచ్చే డబ్బుతో కుటుంబాన్ని ఆదుకోవచ్చని అనుకున్నా. ఈస్ట్‌ బెంగాల్‌ క్లబ్‌ తరపున ఆడితే సీజన్‌కు రూ.2500 ఇచ్చేవారు. అక్కడ మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు కూడా కోల్‌కతాలో చిన్న పిల్లాడినడిగినా నా గురించి చెప్తారు కానీ హైదరాబాద్‌లో నేనెవరికీ తెలీదు.