సాధారణంగా పదిమందిలో మాట్లాడాలంటే కొందరు ఆసక్తి చూపించరు. ముఖ్యంగా తమ నోటి దుర్వాసన ఇతరులను ఇబ్బంది పెడుతుందని భావిస్తుంటారు. రుతువులు, కాలాలతో సంబంధం లేకుండా చాలామందిని బాధించే సమస్య ఇది. ఈ సమస్యను నుండి ఉపశమనం పొందాలంటే ఏం చేయాలో చూద్దాం..

ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం అరస్పూన్ జీలకర్రను నోట్లో వేసుకుని బాగా నమిలి మింగాలి. ఇలా క్రమంగా చేస్తుంటే నోట్లో ఉండే క్రిములు నశించి, దుర్వాసన పోతుంది. అంతేకాదు, జీర్ణశక్తి పెరిగి, జీర్ణాశయం పనితీరు మెరుగుపడుతుంది. దీంతో కూడా దుర్వాసన తగ్గుముఖం పడుతుంది. అలానే స్పూన్ కొబ్బరినూనెను నోట్లో వేసుకోవాలి. 20 నిమిషాల పాటు మింగకుండా పుక్కిలించాలి. ఇలా చేస్తుందే నోటి దుర్వాసనకు చెక్ పెట్టవచ్చును.

దంత సమస్యల వలన వచ్చే దుర్వాసనకు నిమ్మ, బత్తాయి వంటి సిట్రస్ పండ్లు ఔషధంలా పనిచేస్తాయి. అలానే మంచి బ్యాక్టీరియాను పెంచే పెరుగును ఆహారంలో చేర్చుకోవాలి. అప్పుడే సమస్య అదుపులోకి వస్తుంది. గ్లాస్ నిమ్మరసం అరస్పూన్ వంటసోడా వేసి కలిపి తాగుతుంటే నోట్లో, జీర్ణాశయంలోని చెడు బ్యాక్టీరియాలు తొలగిపోతాయి.

గ్లాస్ గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి పుక్కిలించాలి. ఇలా ప్రతిరోజూ ఉదయాన్నే చేస్తే దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. అలానే నోటి దుర్వాసన పోతుంది. 2 స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్‌ను పావుకప్పు మంచినీటిలో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని 15 నుండి 20 నిమిషాలపాటు పుక్కిలిస్తే చాలు. నోటి దుర్వాసన పోతుంది.