పిల్లలకు మనం చెప్పే కథలు వారి ఊహాశక్తికి పదును పెట్టడమే కాకుండా వారి మెదడును చురుకుగా తయారు చేస్తాయన్న విషయం ఇటీవల జపాన్‌లో నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. దీని కోసం సుమారు మూడు వేల మంది చిన్నారుల మీద వారు దీర్ఘకాలం పాటు అధ్యయనం నిర్వహించారు. వీరిని రెండు గ్రూపులుగా విభజించి ఒక గ్రూపు వారిని కేవలం టీవీ, లేదా ఫోన్లకే పరిమితం చేసారు. రెండో గ్రూపు వారిని వీరికి దూరంగా ఉంచడమే కాకుండా ప్రతిరోజు వారికి రకరకాల కథలు వినిపించారు. కొన్ని రోజుల తరువాత పిల్లల మెదడు పనితీరును పరిశీలించగా, కథలు విన్న పిల్లల మెదడు మరింత చురుకుగా పనిచేయడంతో పాటు వారిలో ఊహాశక్తి, జ్ఞాపకశక్తి పెరిగిన విషయం వారు గుర్తించారు. మొదటి గ్రూపు పిల్లలో ఈ అభివృద్ధి వీరికి కనిపించలేదు. అందువలన పిల్లలను టీవీలకు లేదా స్మార్ట్‌ ఫోన్లకు అలవాటు చేయడం కన్నా వారికి రకరకాల కథలు వినిపించడం అలవాటు చేయాలని వారు సూచిస్తున్నారు.