గాంధీ మహాత్ముడి స్ఫూర్తి

రైతులు స్వల్ప ఖర్చుతోనే చెక్క గానుగలు ఏర్పాటు చేసుకోవచ్చు

తాటి, ఈత బెల్లం తయారీకి రాష్ట్ర ప్రభుత్వ అనుమతే తరువాయి

సబ్సిడీ రుణాలు, శిక్షణ ఇవ్వడానికి సిద్ధమంటున్న ఖాదీ కమిషన్‌

జాతిపిత గాంధీజీ పుట్టి నేటికి 150 ఏళ్లు. గ్రామ స్వరాజ్యం కోసం కలలు కన్న గాంధీజీ.. ఆ కల సాకారానికి ఆరోగ్యదాయకమైన మన సంప్రదాయక ఆహార సంస్కృతి పరిరక్షణపై దృష్టిసారించారు. కట్టె గానుగలతో స్వచ్ఛమైన నూనెలు, తాటి బెల్లం వంటి ఆరోగ్యదాయకమైన దేశీ ఆహార పదార్థాలతోనే ప్రజల ఆరోగ్యం పదికాలాల పాటు పదిలంగా ఉంటుందని నమ్మి.. ఆ దిశగా సమాజాన్ని నడిపించారు. అయితే, కాలక్రమంలో ప్రపంచీకరణ పుణ్యాన ఇవి మరుగున పడిపోవడం.. ఫలితంగా అనేక జబ్బులు గతమెన్నడూ ఎరుగని రీతిలో విజృంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిరుధాన్యాలు, చెక్క గానుగ వంట నూనెలు, తాటి బెల్లం వంటి మన సంప్రదాయ విశిష్ట ఆహారాల ద్వారానే జబ్బులను జయించడంతోపాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలుగుతామని స్వతంత్ర వైద్యులు, ఆహార శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

నూనె గింజలను సాగు చేస్తున్న రైతులు ఇంటి దగ్గరే సొంతంగా చెక్క గానుగలను స్వల్ప పెట్టుబడితోనే ఏర్పాటు చేసుకుంటే ఆరోగ్యదాయకమైన గానుగ నూనెలను ఉత్పత్తి చేసి, మంచి ఆదాయం గడించవచ్చు.
గీత కార్మికుల సొసైటీలకు తాటి, ఈత నీరా తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక అనుమతులు ఇస్తే.. తమిళనాడు, కర్ణాటకల్లో మాదిరిగా తెలుగు రాష్ట్రాల్లో కూడా తాటి బెల్లం ఉత్పత్తిని విస్తృతంగా చేపట్టవచ్చు. తద్వారా గ్రామాల్లోనే వేలాది మందికి ఉపాధి లభించడంతోపాటు ప్రజలకు అమృతాహారాన్ని అందించవచ్చు. మధుమేహ రోగులు సైతం నిశ్చింతగా వాడదగినది, రోగనిరోధక శక్తిని పెంపొందించేది.. తాటి బెల్లమని నిపుణులు సూచిస్తున్నారు!    చెక్క గానుగలు, తాటి బెల్లం తయారీ కేంద్రాల ఏర్పాటుకు శిక్షణతోపాటు సబ్సిడీ రుణాలు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉందని గాంధీజీ స్ఫూర్తితో నడుస్తున్న ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్‌(కేంద్ర ప్రభుత్వ సంస్థ) చెబుతోంది. మహాత్ముడి బోధనలు నేడు మనకు అందిస్తున్న ఆహార స్వరాజ్య స్ఫూర్తి ఇదే!

ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరుగుతున్నకొద్దీ రసాయనాలు వాడకుండా తయారు చేసే కట్టె గానుగ వంట నూనెల(కోల్డ్‌ ప్రెస్డ్‌ ఆయిల్స్‌)కు తిరిగి ఆదరణ పెరుగుతోంది. దీంతో, నగరాలు, పట్టణాల్లో వీటికి గిరాకీ పెరుగుతోంది. వేరుశనగలు, కుసుమలు, నువ్వులు, కొబ్బరిని సాగు చేస్తున్న రైతులు, రైతు సహకార సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు వీటితో కట్టె గానుగ నూనెలు తీసి అమ్మితే.. ఏడాది పొడవునా మంచి ఆదాయం లభిస్తుంది. కట్టె గానుగలను ఏర్పాటు చేసుకోవడానికి బ్యాంకు రుణాలు పొందడానికి అవకాశం ఉంది. సబ్సిడీ రుణాలు పొందడానికి కేంద్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖకు అనుబంధంగా పనిచేస్తున్న ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమీషన్‌ తోడ్పాటును అందిస్తున్నది.

హైదరాబాద్‌లోని ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమీషన్‌ రాష్ట్ర కార్యాలయంలో గ్రామీణ పరిశ్రమల విభాగాధికారి మాడుగుల హరి అందించిన వివరాల ప్రకారం.. రైతులు, రైతు సంఘాలతోపాటు.. రైతులు కానప్పటికీ యువతీ యువకులు కూడా సయితం చెక్క గానుగలను గ్రామాల్లో, పట్టణ ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేసుకోవచ్చు. కట్టె గానుగల నిర్వహణకు అవసరమైన సాంకేతిక శిక్షణ అందించడంలో ఖాదీ కమీషన్‌ తోడ్పడుతుంది.

ఇప్పటికీ ఎద్దు గానుగలు నడుస్తున్నాయి..
సంప్రదాయ పద్ధతిలో ఎద్దుతో నడిచే కట్టె గానుగలను ఏర్పాటు చేసుకొని, నిర్వహించడం వ్యయప్రయాసలతో కూడి ఉన్నదైనప్పటికీ గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు, కర్ణాటకలలో కొందరు ఈ రంగంలో కృషి చేస్తున్న వారు ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన ‘సేవ్‌’ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు విజయరామ్, మైసూరుకు చెందిన దేశిరి సంస్థ నిర్వాహకులు నవీన్‌(99458 11771) వంటి వారు కూడా ఎద్దుతో నడిచే కట్టె గానుగలను గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకొని, నిర్వహించడంతోపాటు ఇతరులకూ సహాయ సహకారాలను అందిస్తున్నారు.

మోటారుతో నడిచే కట్టె గానుగలు
ఎద్దులకు బదులు 2 హెచ్‌. పి.– 3 ఫేజ్‌ మోటారుతో చిన్న సైజు కట్టె గానుగలను ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమీషన్, వార్థాలోని జమన్‌లాల్‌ బజాజ్‌ సెంట్రల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ గతంలోనే అభివృద్ధి చేశాయి. వీటిని చాలా తక్కువ స్థలంలోనే ఏర్పాటు చేసుకోవచ్చు. వేరుశనగ, నువ్వులు, కొబ్బరి, కుసుమ, ఆవాల నుంచి వీటి ద్వారా నూనె గానుగ ఆడవచ్చు. 8 గంటల్లో 100–120 కిలోల నూనె గింజలను ఆడవచ్చు. 6“6 అడుగుల చోటు, ఇద్దరు పనివారు చాలు. ధర రూ. లక్ష వరకు ఉంటుందని హైదరాబాద్‌లోని ఖాదీ కమీషన్‌ అధికారులు తెలిపారు.

ఖాదీ కమిషన్‌ ఆధ్వర్యంలో నెల రోజుల శిక్షణ
కట్టె గానుగలను గ్రామీణ/పట్టణ ప్రాంతాల్లో నెలకొల్పుకోవడానికి అవసరమైన సాంకేతిక సహాయాన్ని, శిక్షణా సదుపాయాలను ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ అందిస్తున్నది. నాసిక్‌(మహారాష్ట్ర)లోని డా. అంబేద్కర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌లో అభ్యర్థులకు నెల రోజుల శిక్షణ ఇస్తారు. వసతి ఉచితం. శిక్షణ, మెస్‌ చార్జీలు కలిపి ఒకరికి రూ. 6,400 ఖర్చవుతుంది. ప్రయాణ ఖర్చులు అదనం. ఈ నెల రోజుల్లో గానుగ నిర్వహణలో పూర్వానుభవం లేని వారు కూడా పూర్తిగా నేర్చుకోగలుగుతారని ఖాదీ కమిషన్‌ అధికారులు తెలిపారు.
రైతు/రైతు సహకార సంఘాలు/ రైతు ఉత్పత్తిదారుల సంఘాలు/ మహిళా సహకార సంఘాలు వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. జనరల్‌ అభ్యర్థులు/ మైనారిటీలు/ ఎస్సీ, ఎస్టీలు/ ఓబీసీలు లేదా వ్యక్తిగతంగా యువతీ యువకులు సైతం ఎద్దుతో నడిచే/ మోటారుతో నడిచే కట్టెగానుగలు నెలకొల్పుకోవడానికి రూ. 10 లక్షల వరకు బ్యాంకుల నుంచి సబ్సిడీ రుణాలు పొందవచ్చు. ఇందుకు ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ తోడ్పడుతుంది.

రుణం పొందటం ఎలా?
కట్టె గానుగలకు రుణం కావాల్సిన వారు ఖాదీ కమిషన్‌ వెబ్‌సైట్‌  ద్వారా ధరఖాస్తు చేసుకోవాలి. జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలోని జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్‌ కమిటీ పరిశీలించి, అర్హుల ధరఖాస్తులను బ్యాంకులకు పంపుతుంది. బ్యాంకులు ధరఖాస్తుదారులను పిలిచి, వారి వివరాలను తెలుసుకొని, సంతృప్తి చెందితే రుణం మంజూరు చేస్తారు. రుణ మంజూరు తర్వాత ధరఖాస్తుదారులకు 10 రోజులపాటు బ్యాంకు/ ఖాదీ కమిషన్‌ ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణ ఇస్తారు. రుణ మొత్తంలో 10% ధరఖాస్తుదారులు తమ వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత తొలి విడత రుణాన్ని బ్యాంకు మేనేజర్‌ విడుదల చేస్తారు. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ సబ్సిడీ (మార్జిన్‌ మనీ) మొత్తం కోసం బ్యాంకు మేనేజర్‌ ప్రతిపాదన పంపుతారు. ఆ మొత్తం విడుదలై లబ్ధిదారుల ఖాతాలో డిపాజిట్‌ అవుతుంది. గానుగ సక్రమంగా నడుస్తూ, నెలవారీ కిస్తీలు సజావుగా చెల్లిస్తూ ఉంటే.. 3 ఏళ్ల తర్వాత ఆ సబ్సిడీ మొత్తం మేరకు అప్పు, వడ్డీతో సహా, తగ్గిపోతుంది.

15%– 35% వరకు సబ్సిడీ  
ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ రుణాలపై సబ్సిడీ గ్రామీణ జనరల్‌ అభ్యర్థులకు 25%, అర్బన్‌ (మునిసిపల్‌ కార్పొరేషన్‌/మునిసిపాలిటీ/నగరపంచాయతీ) అభ్యర్థులకు 15% సబ్సిడీ వస్తుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళ, ఓబీసీ, మైనిరిటీ/ మాజీ సైనికులు/ దివ్యాంగులకు గ్రామీణులకైతే 35%, అర్బన్‌వాసులైతే 25% వరకు సబ్సిడీ లభిస్తుంది.

తాటి/ఈత బెల్లం తయారీపై చెన్నైలో శిక్షణ
తాటి, ఈత చెట్ల నీరా నుంచి తయారు చేసే బెల్లం అత్యంత ఆరోగ్యదాయకమైనదని గాంధీజీ ఆనాడే గుర్తించారు. దేశీ ఆహారం విశిష్టతనెరిగిన డా. ఖాదర్‌వలి వంటి నిపుణులు ఇప్పుడూ చెబుతూనే ఉన్నారు.  తాటి/ఈత చెట్ల నుంచి స్వచ్ఛమైన ఆహార పానీయం నీరాను సేకరించి బెల్లం, పంచదార, పటిక బెల్లం వంటి ఉత్పత్తులను తయారు చేస్తారు. తయారీ పద్ధతులపై చెన్నైలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్‌ పామ్‌గుర్‌ అండ్‌ పామ్‌ ప్రోడక్ట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రీయ పద్ధతుల్లో శిక్షణ ఇస్తున్నది. తాటి/ఈత ఉత్పత్తులపై పూర్తిస్థాయి శిక్షణ 4 నెలలు. శిక్షణ ఇప్పించడానికి ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమీషన్‌ సిద్ధంగా ఉంది. చెట్టు నుంచి ఈ ఆహార పానీయాన్ని పులవక ముందు సేకరిస్తే పోషక విలువలతో కూడిన నీరా వస్తుంది. అదే పానీయం పులిస్తే కల్లుగా మారుతుంది.

ఎక్సైజ్‌ శాఖ అనుమతి తప్పనిసరి
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కోట్ల సంఖ్యలో తాటి, ఈత చెట్లు ఉన్నాయి. అయితే, వీటి నుంచి ప్రస్తుతం కల్లు మాత్రమే గీస్తున్నారు. ఈ చెట్లన్నీ ఎక్సైజ్‌ శాఖ ఆధీనంలో ఉంటాయి. తమ పొలంలో ఉన్న తాటి/ఈత చెట్ల నుంచి కూడా రైతులు ఎక్సైజ్‌ శాఖ నుంచి అనుమతి పొందనిదే నీరా సేకరించుకోవడానికి వీలు లేదు. గీత కార్మిక సొసైటీలకు కల్లు గీతకు లైసెన్సులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కల్లు వినియోగం నానాటికీ తగ్గిపోతున్న నేపథ్యంలో లక్షలాది గీత కార్మికుల ఉపాధి ప్రశ్నార్థకంగా మారుతున్నది. ఈ నేపథ్యంలో నీరా తీయడానికి ఎక్సైజ్‌ శాఖ అనుమతి మంజూరు చేస్తే తాటి/ఈత నీరాతో బెల్లం తదితర ఆరోగ్యదాయకమైన ఉత్పత్తులను తయారు చేసుకోవచ్చు. తాటి/ఈత బెల్లానికి షుగర్‌ను పెంచే లక్షణం ఉండదు. మధుమేహం ఉన్న వారు కూడా ఈ బెల్లాన్ని వినియోగించవచ్చని, దీని వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెంపొందుతుందని వైద్యులు చెబుతుండటంతో గీత కార్మికులకు మంచి ఆదాయం సమకూరుతుంది.

ఆరోగ్యం కోసం కట్టె గానుగలను రక్షించుకోవాలి
కట్టె గానుగ నూనె ఎంతో ఆరోగ్యదాయకం. చిన్న వయసులోనే మనుషులు లేనిపోని జబ్బుల పాలవడం, అర్థాయుష్షు.. వంటి విపరిణామాలకు తింటున్న ఆహారం సరైనది కాకపోవడమే కారణం. ఎద్దుతో నడిచే కట్టె గానుగతో తీసిన వంట నూనెలు ఎంతో ఆరోగ్యదాయకం. గాంధీ కలలుకన్న గ్రామస్వరాజ్యానికి కట్టె గానుగ నూనె ఒక ప్రతీక. గ్రామంలో పండే నూనె గింజలు, గ్రామంలో చెట్టు నుంచి వచ్చే కట్టె గానుగ, కట్టె గానుగను తయారు చేసే విశిష్ట నైపుణ్యం కలిగిన కళాకారుడి పరిరక్షణ ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమవుతుంది. మహాత్ముడి స్ఫూర్తిని బతికించుకోవాలన్న తపనతో 2013 శ్రీరామనవమికి తొలి కట్టె గానుగను ఏర్పాటు చేశాను. ఇప్పుడు ఈ గానుగల సంఖ్య ఐదుకు పెరిగింది. మా గానుగ చూసి కర్ణాటకలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు 10 చోట్ల వీటిని ఏర్పాటు చేశారు. జన్యుమార్పిడి పత్తి గింజల నూనెను వంటనూనెలతో కల్తీ చేసి మార్కెట్లో అమ్ముతున్నారు. అటువంటి కల్తీ నూనెల నుంచి మన జాతి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కట్టె గానుగల దేశీ సంస్కతి పరిరక్షణకు అందరం పూనుకోవాలి. కట్టె గానుగ తయారు చేసే కార్పెంటర్లు ఒకరిద్దరు మాత్రమే మిగిలి ఉన్నారు. యువతకు శిక్షణ ఇప్పించడం ద్వారా ఈ విశిష్ట కళను కాపాడుకోవాలి. యూనివర్సిటీలు దీనిపై కోర్సు పెట్టాలి.
– విజయరామ్, సేవ్‌ స్వచ్ఛంద సంస్థ, హైదరాబాద్‌  
ఫోన్లు: 040–27654337, 27635867

ఎవరిని సంప్రదించాలి?
చెక్క గానుగలు, తాటి/ ఈత బెల్లం తయారీ యూనిట్లు.. చిరుధాన్యాలు, పప్పుధాన్యాల శుద్ధి యంత్రాల
యూనిట్లు.. మామిడి తాండ్ర, పచ్చళ్ల తయారీ, నిమ్మ, అనాస, ఉసిరి, బొప్పాయి, సపోట, అరటి తదితర పండ్లతో తయారు చేసే అనేక ఉత్పత్తుల ప్రాసెసింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు సబ్సిడీ రుణాలు, నైపుణ్య శిక్షణలు అందించడానికి ఖాదీ కమిషన్‌ తోడ్పడుతుంది. ఆంధ్ర, తెలంగాణవాసులు చెక్క గానుగలు, తాటి/ఈత బెల్లం తయారీ యూనిట్ల ఏర్పాటుపై పూర్తి వివరాలకు.. హైదరాబాద్‌ నాంపల్లిలోని గాంధీభవన్‌ ఆవరణలో గల ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమీషన్‌ సంచాలకులు వి. చందూలాల్‌ లేదా గ్రామీణ పరిశ్రమల అధికారి మాడుగుల హరిని 040–29704463 నంబరులో ఆఫీసు వేళల్లో సంప్రదించచ్చు. www.kvic.org.in