ఎఫ్‌ఆర్‌వో ఉద్యోగాలు సాధించిన మల్లేశ్వరరావు, శ్రావణి
అన్నపురెడ్డిపల్లి(భద్రాద్రి కొత్తగూడెం), 11-10-2018:ఉన్నత స్థాయి ఉద్యోగం సాదించే వరకు పిల్లలు వద్దనుకున్నారు. పట్టుదలతో చదివారు. టీఎస్‌పీఎస్‌సీ ద్వారా అటవీ రేంజ్‌ అధికారి (ఎఫ్‌ఆర్‌వో) ఉద్యోగాలు సాధించి ఆదర్శంగా నిలిచారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం అబ్బుగూడెం గ్రామానికి చెందిన యువదంపతులు. జుబ్బురు మల్లేశ్వరరావు, శ్రావణి దంపతులు. మూడు రోజుల క్రితం టీఎస్‌పీఎస్‌సీ ఫలితాలు విడుదలవగా 1:3 నిష్పత్తిద్వారా మల్లేశ్వరావు రాష్ట్ర స్థాయి ప్రథమ ర్యాంకు సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శ్రావణి కూడా ఉద్యోగానికి ఎంపికైనట్టు బుధవారం రాత్రి శ్రావణి కుటుంబసభ్యులకు సమాచారం అందింది. దీంతో గ్రామంలో బాణసంచా కాల్చి సంబురాలు జరుపుకొన్నారు. అబ్బుగూడెం గ్రామానికి చెందిన మల్లేశ్వరావుకు.. అదే గ్రామానికి చెందిన శ్రావణితో 2013లో వివాహం జరిగింది. ఇరుకుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు కావడంతో కనీసం పోటీపరీక్షలకు పుస్తకాలు కొనలేని స్థితిలో ఉన్నారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మల్లేశ్వరరావు, శ్రావణి హైదరాబాద్‌లోని చిక్కడపల్లిలో ఓ చిన్న గదిలో నివాసం ఉన్నారు. సమీపంలో ఉన్న సిటీ సెంట్రల్‌ గ్రంథాలయానికి వెళ్లి.. పోటీ పరీక్షలకు సమాయత్తమయ్యారు. వారికి పంపుమెకానిక్‌గా పనిచేస్తున్న మల్లేశ్వరరావు అన్న రమేష్‌తో పాటు అతడి తమ్ముడు, మరదలు ఆర్థికంగా అండగా నిలిచారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో వారు ఎఫ్‌ఆర్‌వో ఉద్యోగాలు సాధించామని మల్లేశ్వరరావు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.