సేవా కార్యక్రమాలు చేసేందుకు నగరంలో అనేక స్వచ్ఛంద సంస్థలు వెలిశాయి. కానీ… డెబ్భై ఏళ్లు క్రితం నగరంలోని మెహిదీపట్నం నానాల్‌నగర్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఓ ఆశ్రమం నేడు కూడా నిరంతరాయంగా సేవలందిస్తూ అందరి మన్ననలను అందుకుంటోంది. అనాథ పిల్లలను అక్కున చేర్చుకొనేందుకు ఈ ఆశ్రమాన్ని ప్రారంభించారు. పుట్‌పాత్‌లపై వదిలే పసికందులను తమ అక్కున చేర్చుకొని సొంత పిల్లల్లా పెంచి, పెద్దచేసి పెళ్ళిళ్లు చేసిన ఖ్యాతి దక్కిందీ ఆశ్రమానికి. పెళ్లి చేసుకొని, కుటుంబ నియంత్రణ పాటించి అనాథ పిల్లలే తమ సొంత పిల్లల్లా భావించి సేవలందించారు ఈ హైదరాబాద్‌ చిల్డ్రన్స్‌ ఎయిడ్‌ సొసైటీ వ్యవస్థాపకులు. వారే దివంగత వి.కె. దాగే, ఆయన భార్య టి. దాగే.

ఆశ్రమ చరిత్ర…
పచ్చటి హరితవనం మధ్య ఆశ్రమ భవనం కొనసాగుతుంది. అక్కడ ఉంటున్న పిల్లలు ఆహ్లాదకర వాతావరణంలో పెరుగుతున్నారు. డెభ్భై సంవత్సరాల చరిత్ర గల హైదరాబాద్‌ చిల్డ్రన్స్‌ ఎయిడ్‌ సొసైటీని స్థాపించిన వి.కె. దాగే చార్టర్డ్‌ అకౌంటెంట్‌గా పనిచేశారు. అనంతరం ఆయన పార్లమెంట్‌ సభ్యులుగా కూడా అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో పనిచేశారు. అదే పరిచయంతో జవహర్‌లాల్‌ నెహ్రూ ఈ ఆశ్రమాన్ని సందర్శించారు. అయితే మెహిదీపట్నం పరిసర ప్రాంతాల్లో తిరిగేటప్పుడు పుట్‌పాత్‌లపై పసికందులను వదిలివెళ్లిన దృశ్యాలను చూసి ఆయన చలించిపోయారు. అదే తడువుగా ఆ పసికందులను ఇంటికి తీసుకెళ్లి ఆలనా, పాలనా చూడడం ప్రారంభించారు. నాటినుంచి అనాథ శిశువులను అక్కున చేర్చుకుంటూ సేవలందిస్తూ వస్తున్నారు.

ఆ సేవలను చూసిన ఆయన ఇంటి పక్కనే ఉంటున్న టి.దాగే, అతనికి అండగా ఉంటూ సేవలందించడం ప్రారంభించింది. ఈనేపథ్యంలో వారిరువురూ వివాహం చేసుకున్నారు. అనాథ పిల్లలే తమ పిల్లలుగా భావించుకుని కుటుంబనియంత్రణ పాటించాలని నిర్ణయించుకున్నారు. అనాఽథ పిల్లల సేవలో తరించిపోయారు. వారు పెరిగి పెద్దవడంతో నానాల్‌నగర్‌ చౌరస్తాలో దాదాపు ఐదు ఎకరాల స్థలంలో అప్పట్లో చిన్న షెడ్డు ఏర్పాటు చేసి చిల్డ్రన్స్‌ ఎయిడ్‌ సొసైటీ సంస్థను సాగిస్తూ వచ్చారు. ఆ తర్వాత 1950లో ది హైదరాబాద్‌ చిల్డ్రన్స్‌ సొసైటీగా దానిని రిజిస్ర్టేషన్‌ చేశారు.

ఆశ్రమంలో 150 మంది ఆడపిల్లలు…
ప్రస్తుతం హైదరాబాద్‌ చిల్డ్రన్స్‌ ఎయిడ్‌ సొసైటీ ఆశ్రమంలో 150 మంది ఆడపిల్లలు ఉంటున్నారు. కేవలం ఆశ్రమంలో ఆడపిల్లలకు మాత్రమే ప్రత్యేకత. అక్కడ చేరుతున్న పిల్లలు కోసం ప్రత్యేకంగా ఎల్‌కేజీ నుంచి 10వ తరగతి వరకు సొసైటీ ఆధ్వర్యంలో పాఠశాలను కొనసాగిస్తున్నారు. అయితే అందులో ఉన్న ఆడపిల్లలు కళాశాల చదువులతోపాటు యూనివర్సిటీ చదువులు, నర్సింగ్‌ కోర్సులు చేస్తున్నారు. అంతేకాక సొసైటీ ఆధ్వర్యంలోనే వారికి వివాహాలు చేస్తున్నారు. ఆడపిల్లల రక్షణ కోసం కరాటే క్లాస్‌లు, స్వయం ఉపాధి కోసం అల్లికలు, కుట్లు, వస్తువులు తయారీ శిక్షణ ఇస్తున్నారు.

ఇక్కడ ఆశ్రమం పొందుతున్న ఆడపిల్లలంతా పెద్దవారై తమ కాళ్లపై తాము నిలబడే స్థాయిలో తీర్చిదిద్దడమే తమ ఆశ్రమ లక్ష్యమని సొసైటీ అధ్యక్షుడు సురేంద్ర లోనియా, సెక్రటరీ అడ్మినిస్ర్టేషన్‌ అండ్‌ ఫైనాన్సర్‌ పూర్ణచందర్‌రావు, సెక్రటరీ జేనీ గుప్త చెపుతున్నారు. ఈ సొసైటీలో ప్రస్తుతం 25 మంది పనిచేస్తున్నారు. అంతేకాక సేవా దృక్పథం ఉన్న వారంతా తమ పెళ్లి రోజులకు, తమ పుట్టిన రోజులకు, తమ పిల్లల పుట్టిన రోజులకు ఈ ఆశ్రమానికి వచ్చి తమకు తోచిన సహాయం అందిస్తున్నారు.

మేనేజింగ్‌ కమిటీ…
ది హైదరాబాద్‌ చిల్డ్రన్స్‌ ఎయిడ్‌ సొసైటీ అధ్యక్షులు సురేంద్ర లూనీయా, ఉపాధ్యక్షులు కమల సురాణా, కార్యదర్శి అడ్మినిస్ర్టేషన్‌, ఫైనాన్సర్‌ పూర్ణచందరావు, కార్యదర్శి జేనీ గుప్తా, కోశాధికారి వినయ్‌ సురాణా, సంయుక్త కార్యదర్శి విమల భద్రుక, సభ్యులు దేవీచంద్‌ గాలా, శారద కోట్రాకా, చంద్రశేఖర్‌, పుష్ఫబూబ్‌, అంబరేశ్‌ పిట్టై.