జకార్తా: ఇండోనేషియా వేదికగా జరుగుతోన్న ఆసియా క్రీడల్లో స్వర్ణంతో తిరిగి వస్తానని తన గురువుకు ఇచ్చిన మాటను నిలబెట్టకున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నాడు భారత రెజ్లర్ పునియా. పురుషుల 65 కేజీల ఫ్రీస్టయిల్ విభాగం ఫైనల్లో భజరంగ్ 11-8తో టకాటని డైచి(జపాన్)ని ఓడించి స్వర్ణ పతకాన్ని ముద్దాడాడు. ఒకే ఏడాది కామన్వెల్త్, ఆసియా క్రీడల స్వర్ణాలు గెలిచిన యోగేశ్వర్ దత్, రాజిందర్సింగ్ సరసన చేరాడు పునియా.
ఈ సందర్భంగా పునియా మాట్లాడుతూ…‘ఆసియా క్రీడల్లో స్వర్ణంతో తిరిగి వస్తానని నా గురువు యోగేశ్వర్ దత్కు మాటిచ్చాను. ఇప్పుడు నా మాట నిలబెట్టుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. 2014 ఆసియా క్రీడల్లో యోగేశ్వర్ బంగారు పతకం సాధించాడు. నా కెరీర్లో అతని ప్రభావం ఎంతో ఉంది. ఇదే ప్రదర్శన నేను భవిష్యత్తుల్లోనూ కొనసాగిస్తే ఒలింపిక్స్లో పతకం గెలవడం ఖాయం. ప్రస్తుతం నా దృష్టంతా ప్రపంచ ఛాంపియన్షిప్ పైనే’ అని పునియా చెప్పాడు. అనంతరం సుశీల్ పరాజయం గురించి మాట్లాడుతూ… ‘సుశీల్ కుమార్ దిగ్గజ ఆటగాడు. అతడు బరిలో ఉన్నాడంటే చాలు బంగారు పతకం ఆశించవచ్చు. కానీ, దురదృష్టవశాత్తూ అతడు తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. సుశీల్ ఓడిపోవడంతో నాతో పాటు మిగతా రెజ్లర్లు కూడా బాధపడ్డారు’ అని పునియా తెలిపాడు.
తాను బంగారు పతకాన్ని అందుకున్న ఫొటోను పునియా ట్విటర్ ద్వారా పంచుకున్నాడు. ‘ఆసియా క్రీడల్లో బంగారు పతకం. ఈ బంగారు పతకాన్ని మాజీ ప్రధాని, దివంగత వాజ్పేయీకి అంకితమిస్తున్నా’ అని పునియా ట్విటర్లో పేర్కొన్నాడు.