గాయత్రీ నారాయణ్‌ది కర్ణాటకలో తుమకూరు జిల్లాలోని మధుగిరి గ్రామం. ఆమె పదోతరగతి వరకే చదువుకున్నారు. అయితేనేం సమస్యతో ఎవరైనా బాధపడుతుంటే విలవిల్లాడిపోతారు. ఒక రోజు టీవీలో నేత్రదానం గురించి ఒక కార్యక్రమాన్ని చూశారామె. అంధులు పడే కష్టాలు చూసి ఆమె చలించిపోయారు. అంధులకు చూపు ప్రసాదించాలన్న లక్ష్యంతో గాయత్రి 1989లో తొలిసారిగా తన నేత్రదాన ప్రయాణాన్ని మొదలెట్టారు. అయినవారిని పోగొట్టుకొని, పుట్టెడు శోకంలో ఉన్నవారిని నేత్రదానానికి ఒప్పించి, మృతిచెందిన వారి కళ్లు సేకరించడమంటే మాటలు కాదు. కానీ ఆ పనిని ఎంతో నేర్పుగా చేస్తారు గాయత్రి. ‘‘ నిజానికి మా కుటుంబంలో ఆడవాళ్లు సమాధుల వద్దకు అసలు వెళ్లరు. అలాంటిది నేను శ్మశాన వాటికల దగ్గరకు వెళ్లి, చనిపోయిన వారి కళ్లు సేకరిస్తున్నా. నేను చేసే పనివల్ల ఇద్దరు అంధులకు చూపు తేవచ్చనే ఆలోచనే ఆ క్షణం నా మదిలో ఉంటుంది’’ అంటారు గాయత్రి. స్వయంగా 35 మంది దాతల నుంచి కళ్లు సేకరించడమే కాకుండా, మరో 250 మంది నుంచి కళ్లు సేకరించడంలో డాక్టర్లకు సహకరించారామె.

సర్టిఫైడ్‌ కోర్సు చేశారు…
గాయత్రి పదోతరగతి వరకే చదువుకున్నా… అంధులకు చూపును ప్రసాదించాలన్న తపనతో మృతుల కళ్లను సేకరించే విద్యను నేర్చుకున్నారు. శాస్త్రీయంగా కళ్లను సేకరించడంలో శిక్షణ తీసుకొని, సర్టిఫికెట్‌ సంపాదించారు. మృతుల నుంచి సేకరించిన కళ్లను భద్రపరిచేందుకు నారాయణ నేత్రాలయ సంస్థ గాయత్రికి ఒక కిట్‌ ఇచ్చింది. ఆ కిట్‌ ఎక్కవ సంఖ్యలో కళ్లను భద్రపరిచేందుకు వీలుగా ఉంటుంది. సేకరించిన కళ్లను కిట్‌లోని శీతలీకరణ పరికరాల్లో ఉంచి, బెంగళూరులోని పలు కంటి నిధి కేంద్రాలకు చేరవేస్తారు.

మొదట్లో తిట్టేవారు..
ఎవరైనా చనిపోయారని తెలియగానే తన బృందంతో ఆ ప్రాంతానికి చేరుకుంటారు గాయత్రి. కొన్నిసార్లు రాత్రిపూట శ్మశానాల దగ్గరికి వెళ్లి కళ్లు సేకరించేవారు. కళ్లను సేకరించే క్రమంలో ఆమె ఎన్నో అవమానాలు భరించారు.‘‘చనిపోయిన వారి కళ్లను తీసుకొని, మార్కెట్లో అమ్ముకుంటున్నా నంటూ చాలామంది నన్ను దుర్భాషలాడేవారు. కానీ వారి మాటలు పట్టించుకోకుండా, నా పని నేను చేసుకుంటూ వెళ్లిపోయేదాన్ని’ అంటారు గాయత్రి. ప్రభుత్వం నుంచి ఆర్థిక చేయూత లేనప్పటికీ, స్వచ్ఛందంగా తన సేవను కొనసాగిస్తున్నారు. బెంగళూరులోని వరదాహిని సేవా ట్రస్ట్‌కు అనుబంధంగా ఆమె సొంతగా ఒక సంగ్రహ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రం పేర విరాళాలు స్వీకరిస్తున్నారు. కళ్లను నగరానికి చేరవేసేందుకు రవాణా ఖర్చుల కోసం ఆ డబ్బును వినియోగిస్తారు. నేత్రాలను ఆసుపత్రులకు తరలించే క్రమంలో ఆమె ఎక్కువగా ప్రజారవాణానే ఉపయోగిస్తాను. బస్సులు అందుబాటులో లేని పరిస్థితిలో క్యాబ్స్‌ను ఆశ్రయిస్తారు. కళ్లను సేకరించడమే కాదు… నేత్రదాన అవగాహన శిబిరాలు ఏర్పాటుచేసి ప్రజలను నేత్రదానం వైపు నడిపించేందుకు తన వంతు కృషి చేస్తున్నారామె. తన ముందు చూపుతో ఎంతోమందికి కంటివెలుగు ఇస్తున్న గాయత్రి సేవా ప్రయాణం స్ఫూర్తిదాయకం.