రంగుల పండుగ హోలీని పెద్దలతో పాటు పిల్లలు కూడా జోష్‌తో జరుపుకుంటారు. అయితే రసాయనాలతో చేసిన రంగులు చర్మంతో పాటు కళ్లకు కూడా హాని చేస్తాయనే విషయం పిల్లలకు తెలియదు. అందుకే హోలీకి కొన్ని ముందు జాగ్రత్తలు పాటించడం వల్ల సంతోషాలకు భద్రత కూడా జతకూడుతుంది. అవేమిటంటే…
పర్యావరణ హిత రంగులు: పెద్దలు సేంద్రియ రంగులను ఉపయోగిస్తే పిల్లలు కూడా వారి బాటలోనే నడుస్తారు. కావున ఇంట్లోకి పర్యావరణ హిత రంగులనే తీసుకురండి. వాటినే పిల్లలకు ఇవ్వండి. వాటివల్ల శరీరానికి ఎలాంటి హాని జరగదు. శుభ్రం చేయడం కూడా సులువే.
నీటి వినియోగం: పర్యావరణాన్ని కాపాడాలనే స్పృహ పిల్లలకు కూడా నేర్పాలి. సంతోషాల పేరిట ఎక్కువ నీటిని వినియోగించడం మంచిది కాదు. అందుకే ఒంటిని శుభ్రం చేసుకునేప్పుడు ఎక్కువ నీళ్లు పారబోయకూడదని చెప్పాలి.
ఆయిలింగ్: హోలీ ఆడేందుకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లేప్పుడు పిల్లల శరీరానికి, ముఖానికి, జుట్టుకు కొబ్బరి నూనె రాయాలి. ఇది వాటర్ ప్రూఫ్ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. దీనివల్ల రంగులు ఎక్కువగా చర్మానికి అంటుకోవు.
పెంపుడు జంతువులతో వద్దు: హోలీ అనేది స్నేహితులు, సన్నిహితులతో ఆడుకునేది. అంతేగానీ ఈ ఆటలోకి పెంపుడు జంతువులను ఇన్వాల్వ్ చేయరాదు. కొందరు పిల్లలు పెంపుడు కుక్కలు, పిల్లులపై రంగులు చల్లి ఆనందిస్తారు. అది మంచిది కాదనే విషయం వారికి స్పష్టంగా చెప్పాలి.
పొడుగు చేతులున్న దుస్తులు మేలు: దుస్తులతో శరీరం మొత్తం కవర్ అయితే మేలు. అందుకే పొడుగు చేతులున్న (స్లీవ్స్) షర్టులు, టీ షర్టులు, టాప్స్ వేయాలి. లెగ్గింగ్స్ వేస్తే బెటర్.
సన్‌గ్లాసెస్: హోలీ రంగులు కళ్లకు హాని చేస్తాయి. అందుకే సన్‌గ్లాసెస్ ధరిస్తే కంట్లో రంగులు పడకుండా కాపాడతాయి. ఒకవేళ రంగులు కళ్లలో పడితే వెంటనే చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
సబ్బులు: పిల్లల చర్మం మృదువుగా ఉంటుంది. హోలీ రంగులను శుభ్రం చేయాలని కఠినమైన సబ్బులను వాడరాదు. బేబీ షాంపూలు, సబ్బులనే వాడాలి.