నిద్రలేమి అనగానే ఎవరికైనా, వెంటనే గుర్తుకు వచ్చేవి నిద్రమాత్రలే. ప్రత్యేకించి మహిళల్లో ఈ సమస్య మరికాస్త ఎక్కుకే కాబట్టి. వెంటనే నిద్ర మాత్రలు తెచ్చేసుకునే ప్రయత్నమే చేస్తారు. అంతేగానీ, నిద్ర పట్టకసోవడానికి గల అసలు కారణమేమిటో తెలుసుకునే ప్రయత్నమైతే చాలా మంది చేయరు. అయితే నిద్రలేమికి ఇప్పటిదాకా తెలిసిన ఇతర కారణాల మాట ఎలా ఉన్నా, ఇటీవల ఒక కొత్త కారణం వెలుగు చూసింది.

అమెరికాలోని వర్జీనియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ మధ్య ఆ కొత్త కారణాన్ని కనుగొన్నారు. ఏ కారణంగానైనా సర్జరీ ద్వారా గర్భసంచి తొలగించడంతో వచ్చే మెనోపాజ్‌ వల్ల ఈ నిద్రా సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయని వారు తెలుసుకున్నారు. అయితే, వయసు దాటిపోయి సహజసిద్దంగా మెనోపాజ్‌ వచ్చిన వారిలో ఈ సమస్యలు అంతగా లేవని వారు గమనించారు. అర్థంతరంగా గర్భసంచి తీసివేయడం ద్వారా హార్మోన్‌ వ్యవస్థలో, జీవక్రియల్లో చోటుచేసుకునే తేడాలే ఈ నిద్రలేమికి కారణమని వారు చెబుతున్నారు. దీనివల్ల శారీరక సమస్యగానే కాకుండా, ఒక దశలో దిగులు, ఆందోళన వంటి మానసిక సమస్యలకు కూడా తలెత్తే ప్రమాదం ఉంది.