ఆటలో అత్యున్నత స్థాయిని అందుకున్నాడు. అప్రతిహత విజయాలతో సాగిపోయాడు. ఎవరికీ సాధ్యం కాని ఘనతలు అందుకున్నాడు. ప్రపంచ క్రీడా చరిత్రలోనే సువర్ణాక్షరాలతో తన పేరును లిఖించుకున్నాడు. వేల కోట్లు సంపాదించాడు. ఎన్నో పురస్కారాలు పొందాడు. కానీ అతను సంపాదించుకున్న కీర్తి మొత్తం కొన్ని రోజుల్లో తుడిచిపెట్టుకుపోయింది. అతడి తెర వెనుక బాగోతాల గురించి బయట పడగానే ఎటు చూసినా విమర్శలు, చీదరింపులు! ఈ గొడవకు తోడు గాయాల బాధతో ఆట గాడి తప్పింది. వ్యక్తిగత జీవితం దారి తప్పింది. ఆదాయం పోయింది. శిఖరం నుంచి పాతాళానికి పడ్డాడు. ఇక అతడి కథ ముగిసిందనే అంతా అనుకున్నారు. కానీ ఫీనిక్స్ పక్షి బూడిద నుంచి లేచినట్లు ఇప్పుడు మళ్లీ అతడు లేచాడు. ఒక గొప్ప రికార్డు దిశగా అడుగులేస్తున్నాడు టైగర్‌వుడ్స్.గోల్ఫ్ అంటే టైగర్‌వుడ్స్.. టైగర్‌వుడ్స్ అంటే గోల్ఫ్! అతడి కంటే ముందు, తర్వాత గోల్ఫ్‌లోకి అగ్రశ్రేణి క్రీడాకారులెందరో వచ్చారు. కానీ టైగర్ లాగా ప్రభంజనం సృష్టించి.. అతడిలా గోల్ఫ్‌కు ప్రాచుర్యం తెచ్చిన వాళ్లు మరొకరు లేరు. గోల్ఫ్ గురించి పెద్దగా తెలియని వాళ్లు సైతం టైగర్‌వుడ్స్ అంటే ఒక మేటి గోల్ఫ్ క్రీడాకారుడు అనే విషయాన్ని గుర్తిస్తారు! ఈ ఆటలో అతను సాధించిన ఘనతలు, తెచ్చుకున్న పేరు అలాంటివి. 20 ఏళ్ల వయసులో ప్రొఫెషనల్ గోల్ఫర్ అయిన వుడ్స్ ఏడాది తిరక్కుండానే ప్రపంచ నంబర్‌వన్ అయ్యాడు. 1999 నుంచి దశాబ్దం పాటు అతడి జైత్రయాత్ర సాగింది. ఈ మధ్య కాలంలో ఏకంగా 683 వారాల పాటు ప్రపంచ నంబర్‌వన్‌గా కొనసాగిన ఘనుడు టైగర్. రికార్డు స్థాయిలో 11 సార్లు ‘పీజీఏ గోల్ఫర్ ఆఫ్ ద ఇయర్’గా నిలిచాడు. ఇంకా ఎన్నెన్నో ఘనతలు సాధించాడు. వేల కోట్లు సంపాదించాడు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని, పిల్లలతో వ్యక్తిగత జీవితంలోనూ సంతోషంగా సాగిపోతుండేవాడు. అలాంటి సమయంలో వచ్చింది ఓ భారీ కుదుపు!
2009లో వుడ్స్‌లోని మరో కోణం బయటికి వచ్చింది. వుడ్స్ స్త్రీ లోలుడని.. అతడికి పదుల సంఖ్యలో అమ్మాయిలతో వివాహేతర సంబంధాలున్నాయని.. ఒకేసారి పలువురు మహిళలతో శృంగారం జరిపాడని మీడియాలో కథనాలు వచ్చాయి. చాలామంది అమ్మాయిలు వుడ్స్‌తో తమకు సంబంధం ఉందని వెల్లడించారు. ఇది పెద్ద వివాదంగా మారింది. చివరికి వుడ్స్ సైతం ఈ ఆరోపణలు నిజాలే అని అంగీకరిస్తూ తనను అభిమానించే వాళ్లందరికీ క్షమాపణలు చెప్పాడు. ఈ గొడవ కారణంగా వుడ్స్ భార్య అతడి నుంచి విడిపోయింది. ఆమెకు వేల కోట్ల రూపాయలు భరణంగా సమర్పించుకోవాల్సి వచ్చింది. వుడ్స్‌కు చాలా చెడ్డ పేరు రావడంతో పలు సంస్థలు అతడితో వాణిజ్య ఒప్పందాల్ని రద్దు చేసుకున్నాయి. ఈ వివాదం కారణంగా వుడ్స్ ఆట కూడా దెబ్బ తింది. అతను కొంత కాలం మైదానం వైపే రాలేదు. మళ్లీ కొన్నేళ్లకు పునరాగమనం చేసినా మునుపటి స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయాడు. ర్యాంకు 1000 దాటిపోయింది. వయసు కూడా మీద పడటంతో గోల్ఫ్‌లో ఇక అతడి ప్రస్థానం ముగిసినట్లేనని అంతా అనుకున్నారు. కానీ..
ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ వుడ్స్ ఆటను వదిలేయలేదు. నెమ్మదిగా విజయాలు సాధించడం మొదలుపెట్టాడు. తాజాగా ఈస్ట్ లేక్ పీజీఏ టూర్ టైటిల్ సాధించాడు. అతను ఐదేళ్ల విరామం తర్వాత టైటిల్ గెలవడం విశేషం. దీంతో అతడి పీజీఏ టైటిళ్ల సంఖ్య 80కి చేరుకుంది. నిజానికి స్నీడ్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు (82)ను అతనెప్పుడో దాటేయాల్సింది. ఎప్పటికైనా ఆ రికార్డు తనదే అని ధీమా వ్యక్తం చేస్తున్నాడు వుడ్స్.