ఇంటిని చక్కదిద్దే మహిళలకు… డబ్బును లెక్కప్రకారం ఖర్చుచేయడం, పొదుపు చేయడం ఎలాగో తెలియడం కూడా ఎంతో ముఖ్యం. డబ్బు నిర్వహణ మీద అవగాహన పెంచుకుంటే ఆర్థికంగా ఎదురయ్యే ఒడుదొడుకులను తట్టుకోవడం సులభమవుతుంది. అదెలాగంటే…
తక్కువ ఖర్చు: సంపాదన కన్నా ఖర్చు తక్కువ ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. తెలివైన నిర్ణయం కూడా. పొదుపు చేయలేదంటే ఆర్థిక చిక్కులు తప్పవు. ఆదాయంలో నెలనెలా కొంత పొదుపు చేయాలి. ఆ డబ్బుతో భవిష్యత్ అవసరాలను తీర్చుకోవడం సులభమవుతుంది.
ఎమర్జెన్సీ ఫండ్: మీ ఆరు నెలల ఖర్చులను ఫిక్స్డ్ డిపాజిట్ లేదా లిక్విడ్ మ్యూచువల్ ఫండ్ కింద భద్రపరచుకోవాలి. ఈ డబ్బు అత్యవసర సమయంలో ఉపయోగపడుతుంది.
బీమా: ప్రస్తుత కాలంలో బీమా అనేది అందరికీ తప్పనిసరి. మీకూ, మీ కుటుంబ సభ్యులకూ ఆరోగ్య బీమా, జీవిత బీమా తీసుకోవాలి. దీంతో క్లిష్ట సమయంలో డబ్బు కోసం అగచాట్లు పడాల్సిన పరిస్థితి తప్పుతుంది.
ఆర్థిక లక్ష్యాలు: ముందస్తు ఉద్యోగ విరమణ, కొత్త ఇల్లు కొనడం, పిల్లల చదువుల ఖర్చులు వంటి ఆర్థిక లక్ష్యాలు చాలామందికి ఉంటాయి. ఏ అవసరానికి ఎంత డబ్బు అవసరమవుతుందనే విషయంలో స్పష్టత ఉంటే ఎంత డబ్బు పొదుపు చేయాలో తెలుస్తుంది. దాంతో ఆర్థిక ఇబ్బందులు రావు.
తాత్కాలిక ప్లాన్: ఈక్విటీ మార్కెట్లోని డబ్బు సమయానికి అందకపోవచ్చు. అయిదు సంవత్సరాల లోపే డబ్బు అవసరం పడే పరిస్థితుల్లో డెట్, అర్బిట్రేజ్ ఫండ్స్‌ను ఎంచుకోవడం మేలు.
దీర్ఘకాలిక లక్ష్యాలు: సొమ్మును దీర్ఘకాలికంగా (దాదాపు అయిదు సంవత్సరాలు) మదుపు చేయడం మంచి ఆలోచన. దానివల్ల ఏడాదికి పది శాతం, తరువాతి రెండు సంవత్సరాల్లో ఇరవై నుంచి ముఫ్పయి శాతం, పది సంవత్సరాల్లో 40- 50 శాతం పెరుగుతుంది. మార్కెట్ ఒడుదొడుకులకు లోనైనా నష్టం రాదు.