సొంతూరు బాపట్ల అయినా హైదరాబాద్‌లో స్థిరపడిన కుటుంబం మాది. నాన్న ఆర్పీఎఫ్లో సీఐగా పనిచేసి రిటైరయ్యారు. ఇంట్లో పెద్దదాన్ని నేనే. తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీ నుంచి 2001లో ఇంగ్లీష్ లిటరేచర్‌లో మాస్టర్స్ పూర్తిచేశాను. మీడియా రంగం మీద ఆసక్తితో హైదరాబాద్ దూరదర్శన్‌లో ‘ప్రభాత దర్శిని’ కార్యక్రమ నిర్వహకురాలిగా, దూరదర్శన్ ఢిల్లీ ఎడిషన్‌లో కూడా పనిచేశా. మరోవైపు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇంగ్లీష్ పాఠాలు, టోఫెల్ క్లాసులు చేప్పేదాన్ని. అలా పదేళ్లు బిజీగా గడిచిపోయాయి. 2011లో సౌదీ అరేబియాలోని ‘దమామ్ యూనివర్సిటీ’లో ఇంగ్లీష్ అసోసియేట్ ప్రొఫెసర్‌గా అవకాశం వచ్చింది. ఆరేళ్లు అసలు విశ్రాంతనేదే లేకుండా పనిచేశా. 2016లో ఒక న్యూస్ చానల్లో క్రియేటివ్ హెడ్‌గా అవకాశం వచ్చింది. స్వశక్తితో ఎదిగిన అనాథ అమ్మాయిల జీవితాల్ని ఆవిష్కరించిన ‘నగిషీ’ ప్రొగ్రామ్ నాకు బాగా పేరు తెచ్చింది. అయితే ఎన్నేళ్లు ఇలా ఉద్యోగం చేస్తూ, నా కోసం నేను బతకడం… సమాజం కోసం ఏం చేయలేకపోయాననే అసంతృప్తి నన్ను వేధిస్తూ ఉండేది.
ఎన్జీవో ఆలోచన…
హైదరాబాద్ నాకు అనేక ఉద్యోగావకాశాలిచ్చింది. నాకంటూ ఒక జీవితాన్నిచ్చింది. అందుకే ఈ నగరం కోసం ఏదైనా చేయాలనిపించేది. నేను ‘గివ్ బ్యాక్ టు సొసైటీ’ కాన్సెప్టును బలంగా నమ్ముతా. ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఒక ఆర్గనైజేషన్ ప్రారంభించి సేవాకార్యక్రమాలు చేయాలనుకునేదాన్ని. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టాలనే ఆలోచన అప్పుడే తట్టింది. అందులోని తృప్తి దేనిలోనూ ఉండదు. హైదరాబాద్‌లో ఆస్పత్రులు, పార్కులు, పబ్లిక్ స్థలాల వద్ద పట్టెడన్నం కోసం ఆబగా ఎదురుచూసే వాళ్లను ఎంతోమందిని చూశాను. ఫేస్బుక్లో ఒక వీడియోలో చిన్న పిల్ల దోసెడు మెతుకుల కోసం పడిన తపన నన్ను బాగా కలిచివేసింది. గత ఏడాది ఫిబ్రవరి చివర్లో ‘ఆపిల్ హోమ్స్’ ఆర్గనైజేషన్‌ను రిజష్టర్ చేశా. ఈ పేరు పెట్టడానికి కారణం… నా కూతురు పేరు ఆపిల్. లోగోలో పచ్చ ఆపిల్ ఉంటుంది. ఇది హెల్తీనెస్ను సూచిస్తుంది. ఆర్గనైజేషన్‌లో అయిదు విభాగాలున్నాయి. వాటిలో మొదటిది ‘ఫీడ్ ద నీడ్’.
విభిన్నంగా చేయాలనే…
కేరళ, శ్రీకాకుళం వరదల సమయంలో ఆర్గనైజేషన్ తరపున సేవలందించాం. కానీ అలా సాయం చేయడానికి చాలా ఆర్గనైజేషన్లు ఉన్నాయి. వాటికి భిన్నంగా ఏదైనా చేయాలనుకున్నా. పెళ్లిళ్లలో, హోటళ్ళలో చాలా ఆహారం వృథా అవుతుంది. అంత మంచి ఫుడ్‌ను ఎందుకు పడేయాలి? అప్పుడే ఫ్రీజర్ పెట్టాలనే ఆలోచన వచ్చింది. పూర్తిగా ఆర్గనైజేషన్ పనులు చూసేందుకు గత నవంబర్‌లో ఉద్యోగానికి రాజీనామా చేశా. ‘మంచి జీతం వదులుకొని పబ్లిక్ ప్లేసెస్‌లో ఫ్రిజ్ పెడతానంటావ్?’ అని చాలామంది ఎగతాళి చేశారు. అయితే వారి మాటలేవి పట్టించుకోకుండా నా లక్ష్యం వైపు కదిలాను. అప్పటికే చెన్నై, బెంగళూరులో ఏర్పాటు చేసిన పబ్లిక్ ఫ్రిజ్ ప్రాజెక్టు గురించి చదివాను.
అయితే వాటి నిర్వహణలోపం, వాటిలో కలుషిత ఆహారం ఉంచడం, కమ్యూనిటీ వాళ్లు ఏర్పాటుచేయడం వల్ల విజయవంతం కాలేదని తెలుసుకున్నా. ఆర్నెళ్లపాటు రీసెర్చ్ చేశా. అక్కడ విఫలమవడానికి ప్రభుత్వ సహకారం లేకపోవడం అని అర్థమైంది. నేను ఆ పొరపాటు చేయకూడదనుకున్నా. రెండునెలలు హైదరాబాద్ అంతా తిరిగి పబ్లిక్ ఫ్రిజ్ ఉంచేందుకు అనువైన 100 ప్రదేశాలను గుర్తించాను. ఒక్కో రోజు ఉదయం 6 గంటలకు వెళ్లి రాత్రి పదకొండు గంటలకు ఇంటికి చేరేదాన్ని. రెస్టారెంట్, హోటల్ యజమానులను కలిపి నా ప్రాజెక్టు వివరించేదాన్ని. ఎవరూ ఒప్పుకొనేవారు కాదు. జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్గారిని నా ప్రపోజల్‌తో కలిశాను. ఆయనకు నా ఆలోచన నచ్చి వెస్ట్‌జోన్ కమిషనర్ హరిచందన గారికి నా పని అప్పగించారు. మొదటి స్టాండింగ్ కమిటీలో ‘ఇది అన్నపూర్ణ పథకం లాగానే ఉంద’ని రిజెక్ట్ చేశారు. అయినా నిరాశ చెందకుండా ఇరవై రోజులు మేయర్ ఆఫీస్ చుట్టూ తిరిగాను. నాలుగో స్టాండింగ్ కమిటీలో అంతా అంగీకరించారు. ట్రయల్ రన్లో భాగంగా రెండు పబ్లిక్ ఫ్రిజ్‌ల ఏర్పాటుకు ఈ ఏడాది జనవరి 10న అనుమతి వచ్చింది. ఫ్రిజ్ పెట్టేందుకు చిన్న స్థలం, విద్యుత్‌ను ఉచితంగా ఇచ్చేందుకు జీహెచ్ఎంసీ ముందుకొచ్చింది.
ఆహారానికి విడివిడిగా రాక్స్…
ఆహారాన్ని నిల్వ ఉంచే ఫ్రిజ్ ఎలా ఉండాలనే దానిపై అనేక కసరత్తులు చేశాను. దాదాపుగా 30 స్కెచ్‌ల తరువాత లోగో డిజైన్ నేను అనుకున్నట్టు వచ్చింది. లోగోలో పైన ఒక మహిళ చేయి, కింద చిన్నారుల చేతులు కనిపిస్తాయి. పూల మొక్కలతో ప్రతి యూనిట్ వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. రోడ్డు పక్కనే అర్థరాత్రి కూడా డిజైనింగ్ పనులు చూసుకునేదాన్ని. ఈ ప్రాజెక్టు, డిజైన్ కోసం ఇప్పటి వరకూ సొంతంగా 7 లక్షల రూపాయలు ఖర్చు చేశా. ఫ్రిజ్‌లో వెజ్, నాన్ వెజ్ ఆహార పదార్థాలు ఉంచేందుకు విడివిడిగా ర్యాకులు, అలాగే ఏ విధమైన ఆహారం ఫ్రిజ్‌లో ఉంచాలో సూచనలు రాసి ఉంచాను. బిస్కెట్లు, చాక్లెట్లు, వాటర్ బాటిల్స్ కూడా ఫ్రిజ్‌లో ఉంటాయి. 530 లీటర్ల ఫ్రిజ్ అందరికీ అన్నివేళలా అందుబాటులో ఉంటుంది.
మొబైల్ యాప్ కూడా…
‘ఫీడ్ ద నీడ్’ కార్యక్రమానికి మంచి స్పందన రావడంతో మొబైల్ యాప్, మొబైల్ వ్యాన్ ప్రారంభించే ఆలోచనల్లో జీహెచ్ఎంసీ (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) ఉంది. పబ్లిక్ ఫ్రీజర్స్‌లో ఆహారం ఉంచాలనుకుంటున్న హోటళ్లు, సంస్థల, వ్యక్తులందరికీ ఈ యాప్ కామన్ ఫ్లాట్‌ఫామ్. ఆహారం ప్యాకింగ్ సరిగ్గా ఉందా? ఆకలితో ఉన్నవారితో ఆ ఫుడ్ చేరిందా? లేదా? తెలుసుకునే సదుపాయం ఇందులో ఉంటుంది. ‘ఆపిల్ హోమ్స్’తో పాటు ‘ద రాబిన్ హుడ్ ఆర్మీ’ సంస్థ కూడా మొబైల్ వ్యాన్స్‌ను జీహెచ్ఎంసీకి అందించేందుకు అంగీకరించాయి. వాలంటైన్ డే (ఫిబ్రవరి 14న) సందర్భంగా ‘ఫీడ్ ద పూర్… స్ర్పెడ్ లవ్’ అనే కార్యక్రమాన్ని కూడా దీనికి అనుసంధానం చేసే ఆలోచనలో ఉంది జీహెచ్ఎంసీ.
లక్ష్యం… 100…
ఈ ప్రాజెక్టు జనవరి 31న హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలుత 10 యూనిట్లను నగరవ్యాప్తంగా పలుచోట్ల ఉంచాను. ప్రతి యూనిట్ వద్ద ఒక పర్యవేక్షకుడిని నెలకు ఆరువేల జీతానికి నియమించాను. ఆకలిగా ఉన్నవారికి ఆహారం అందిచడం, వండిన ఆహారం నాణ్యంగా ఉందా? ప్యాకింగ్ సరిగ్గా ఉందా? లేదా? గమనిస్తారు. కేవలం ఆటోవాలాలు, అనాథలు, కూలీలే కాదు ఆకలితో ఉన్నవాళ్లు కూడా వీటి ద్వారా తమ ఆకలి తీర్చుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలో ప్రతీ 10 కిలోమీటర్లకు ఒకటి చొప్పున వంద పబ్లిక్ ఫ్రిజ్‌లు ఏర్పాటు చేయాలనుకుంటున్నా. ఒక్కో యూనిట్ ద్వారా రోజుకు 20 నుంచి 50 మంది ఆకలి తీర్చాలన్నదే నా లక్ష్యం. అయితే నేనొక్కదాన్ని అన్ని ఫ్రిజ్‌లు కొనడం సాధ్యంకాని పని. దాతలు ఎవరైనా ఫ్రిజ్ డొనేట్ చేస్తే వారి పేరు, ఫొటో, వివరాలు ముద్రిస్తాం. ఇక నా విషయానికొస్తే 2003లో అమ్మానాన్న చనిపోయారు. 2008లో విడాకులు తీసుకున్నా. నేను సింగిల్ పేరెంట్ను. నాకు ఏడేళ్ల పాప, ఆరేళ్ల బాబు ఉన్నారు. సంకల్పం బలంగా ఉండి, చిత్తశుద్ధితో, ధైర్యంగా ముందడుగు వేస్తే మహిళలు ఎవరి సపోర్టు లేకున్నా దూసుకుపోగలరనడానికి నేనే ఒక ఉదాహరణ.